బంజారాహిల్స్, అక్టోబర్ 24: సరైన కారణం లేకుండా తన నామినేషన్లను ఎలా తిరస్కరిస్తారని జూబ్లీహిల్స్ రిటర్నింగ్ అధికారిని నిలదీయడంతోపాటు అధికారులపై ఆరోపణలు చేసిన హెచ్వైసీ వ్యవస్థాపకుడు సల్మాన్‌ఖాన్ మీద బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హెచ్వైసీ పేరుతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సల్మాన్‌ఖాన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలుచేశారు. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన అనంతరం సల్మాన్‌ఖాన్ దాఖలుచేసిన నాలుగు సెట్ల నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
దీంతో సల్మాన్‌ఖాన్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్లో కొన్ని కాలమ్స్ నింపకపోయినా అనుమతించారని, తన నామినేషన్లను మాత్రం ఎలా తిరస్కరించారంటూ గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సల్మాన్‌ఖాన్‌ను అక్కడినుంచి బయటకు పంపించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ముద్రించిన పుస్తకంలోని నిబంధనలను ఏమాత్రం పట్టించుకోని ఆరోవో తన నామినేషన్లను మాత్రం తిరస్కరించారని మీడియా ఎదుట సల్మాన్‌ఖాన్ ఆరోపించారు. ఇదిలా ఉండగా గురువారం మధ్యాహ్నం సల్మాన్‌ఖాన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా తన విధులను అడ్డుకోవడంతోపాటు దుర్భాషలాడిన సల్మాన్‌ఖాన్ మీద చర్యలు తీసుకోవాలంటూ సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రిటర్నింగ్ అధికారి సాయిరామ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిపై కేసు నమోదు చేశారు.