ఖైరతాబాద్, మార్చి 10: రాష్ట్రంలోని ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) డీఎస్పీ డీ ప్రణీత్‌కుమార్ అలియాస్ ప్రణీత్‌రావుపై పంజాగుట్ట పోలీసులు నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అదనపు ఎస్పీ డీ రమేశ్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. 2023లో డీఎస్పీగా ఉన్న ఆయనకు రెండు ప్రత్యేక గదులు, 17 కంప్యూటర్లు, ప్రత్యేక లీజ్డ్ లైన్‌తో ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించారు. చట్టవిరుద్ధంగా ఆయన పలువురి ఫోన్లను ట్యాప్ చేసి, ఆ సమాచారాన్ని పెన్‌డ్రైవ్‌లు, ఇతర ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్కుల్లో భద్రపరిచాడని, డిసెంబర్ 4న అవన్నీ నాశనం చేసి, సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో ప్రణీత్‌రావుపై పీడీపీపీ యాక్ట్-1984తోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది.