హైదరాబాద్ : ఢిల్లీలోని స్విట్జర్లాండ్ ఎంబసీ(Switzerland Embassy) ‘భారత్-స్విస్ మైత్రీ’ అంశం మీద నిర్వహించిన కార్టూన్ పోటీలో నమస్తే తెలంగాణ(Namasthe telangana) కార్టూన్ ఎడిటర్ చిలువేరు మృత్యుంజయ్(Cartoonist Mrityunjay) గీసిన కార్టూన్‌కు బహుమతి లభించింది. దేశవ్యాప్తంగా అసం ఖ్యాకంగా వచ్చిన కార్టూన్లలో 19 కార్టూన్లను ఎంపికచేసి విజేతలకు నగదు పారితోషకం అందించి నున్నట్టు స్విట్జర్లాండ్ ఎంబసీ కల్చరల్ ప్రోగ్రాం ఆఫీసర్ తనీమా మణికంటల తెలియజేసారు. ‘స్విట్జర్లాండ్-ఇండియా 75: సక్సెస్ స్టోరీస్ టు బీ కంటిన్యూ’ పేరిట ఈ కార్టూన్లను కేరళ కార్టూన్ అకాడమీ సహకారంతో ఈ నెల 21 నుంచి 25 వరకు కొచ్చీలో జరిగే నేషనల్ కార్టూన్, క్యారికేచర్ ఫెస్టివల్ ‘క్యారిటూన్’లో ప్రదర్శించనున్నారు.
లలితకళా అకాడమీ చైర్ పర్సన్ మురళి అధ్యక్షత వహించగా, స్విట్జర్లాండ్ ఎంబసీ కాన్సులేట్ జనరల్ ప్యాట్రిక్ ముల్లర్ ఈ ప్రదర్శనను ప్రారంభించి ప్రసంగిస్తారని అలాగే కల్చరల్ సెంటర్ డైరెక్టర్ అనిల్ ఫిలిప్, కార్టూన్ డైరెక్టర్ రతీశ్ రవి, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సుధీర్ నాథ్, సెక్రటరీలు సతీశ్, బాలమురళీకృష్ణన్ పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనను స్విట్జర్లాండ్‌లో కూడా ప్రదర్శించనున్నట్టు తనీమా మణికంటల పేర్కొన్నారు.