హైదరాబాద్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ): ‘పాలిచ్చే బర్రెను వదిలేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నట్టు’ ఉంది ఆర్టీసీ (TGSRTC) యాజమాన్యం పరిస్థితి. ఏటా సుమారు రూ.100 కోట్ల పైగా రాబడి తెచ్చిపెట్టే కార్గోను (RTC Cargo) సొంతంగా నిర్వహించుకోవాల్సింది పోయి…. కేవలం నెలకు రూ.3 కోట్లు చెల్లించే ప్రైవేట్ సంస్థకు అప్పనంగా అప్పగించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. దీంతో 10 నుంచి 15 ఏండ్ల పాటు ఆర్టీసీ కార్గో సేవలు ప్రైవేట్ సంస్థ ఆధీనంలోనే ఉంటాయి. ఈ టెండర్లకు సంబంధించి కొన్ని ఎంపిక చేసిన పత్రికల్లో మాత్రమే ఎక్కడో ఓ మూలన టెండర్ ప్రకటన ఇచ్చి.. అత్యంత రహస్యంగా ఆర్టీసీ ఈ ప్రక్రియను ముగించింది. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ అద్భుతమైన కార్గో సేవల ద్వారా ఏటా ఆర్టీసీకి భారీగా లాభాలు వచ్చాయి. 2020లో ప్రారంభమైన ఆర్టీసీ కార్గో సేవలు తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందాయి. దీంతో ప్రజలకు తక్కువ ధరల్లోనే నమ్మకమైన సరుకు రవాణా కార్యకలపాలు సాగిస్తూ.. ఆర్టీసీకి లాభాల్లో తనవంతు భాగస్వామ్యాన్ని అందించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి సుమారు రూ.100 కోట్ల రాబడి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అటువంటి సంస్థను నిర్వహించడంపై దృష్టి పెట్టకుండా ప్రభుత్వ పెద్దల సూచన మేరకు ఆర్టీసీ కార్గో సేవలను ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించింది. దీంతో ఇప్పటికే ఆర్టీసీ నుంచి ప్రైవేట్ పరం అయిన సంస్థల్లో కార్గో కూడా చేరింది.
అడ్డగోలుగా ఆర్టీసీ సాకులు
డ్రైవర్లు, కండక్టర్ల వేతనాలు, డీజిల్, ఇతర ఖర్చులను సాకుగా చూపి ఏటా రూ.100 కోట్ల వరకూ రాబడి వచ్చే కార్గో సేవలను నెలకు కేవలం రూ.3 కోట్ల చెల్లింపు ఒప్పందంతోనే ఆర్టీసీ సంస్థ ప్రైవేట్‌పరం చేసింది. కార్గో సేవలను నిర్వహించడం భారంగా మారడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యాజమాన్యం సాకులు చెప్తున్నది. ఆర్టీసీకి చెందిన డ్రైవర్లు, కండక్టర్లు కార్గో సర్వీసులలో విధులు నిర్వహించేందుకు ఏమాత్రం ఆసక్తి కనబర్చడంలేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఇటీవల ఆర్టీసీ సంస్థలో భారీగా ఉద్యోగ విరమణలు జరిగాయి. కానీ, కొత్తగా సిబ్బందిని నియమించుకోవడంలో ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ మీనమేషాలు లెక్కిస్తున్నదని పలువురు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు కార్గో సేవలు నిర్వహించే వారిపట్ల డీఎంలు, ఆర్ఎంల వేధింపులు దారుణంగా ఉంటున్నాయని సమాచారం. ఈ క్రమంలో కొత్తగా నియామకాలు చేపట్టి, ఉన్న వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దుకోవల్సిన ఆర్టీసీ.. ప్రైవేట్‌కు ఇచ్చేందుకు మొగ్గుచూపడం సిబ్బందిని సైతం తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడాదికి వచ్చే రూ.100 కోట్ల రాబడి ఎక్కడ? ప్రైవేట్ ఏజెన్సీ ఇచ్చే రూ.36 కోట్లు ఎక్కడ? అని ప్రశ్నిస్తున్నారు. ఖర్చు తగ్గించుకోవాల్సిన చోట తగ్గించుకోకుండా.. ఉన్న సంస్థలన్నీ ఇలా ప్రైవేట్ పరం చేయడం ఏంటని కార్మిక సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంస్థతీరుపై మండిపడుతున్నారు.
కార్గో సేవలను దక్కించుకున్న అవేజీ సంస్థ
గతంలో కొన్ని చిన్న బస్టాప్‌లలో మాత్రమే సేవలందించేందుకు ప్రైవేట్ ఏజెన్సీలను ఆహ్వానించారు. ప్రస్తుతం ఆర్టీసీకి సంబంధించిన కార్గో సేవలన్నీంటిని నిర్వహించుకునేందుకు ‘మాస్టర్ ఏజెన్సీ’ని ప్రభుత్వ సూచన మేరకు ఆర్టీసీ ఆహ్వానించింది. ఈ మేరకు గత ఆగస్టులో టెండర్ నోటిఫికేషన్ (నం: C2/644(1)/2025-BH) విడుదల చేసింది. దరఖాస్తుదారుకు గత 3 ఆర్థిక సంవత్సరాలలో (2022-23, 2023-24, 2024-25) సగటు వార్షిక టర్నోవర్ రూ.200 కోట్ల కంటే ఎకువ ఉండాలి. నికర విలువ 31.03.2025 నాటికి కనీసం రూ.100 కోట్లు వరకు ఉండాలనే నిబంధనతో ఈ టెండర్లు పిలిచారు. దీంతో ఆన్లైన్ వేలంలో పలు సంస్థలు పాల్గొనగా ‘అవేజీ ప్రైవేట్ లిమిటెడ్’ ఈ టెండర్‌ను దక్కించుకున్నట్టు తెలిసింది. ఆర్టీసీ పెట్టిన నిబంధనల ప్రకారం నెలకు రూ.3 కోట్లు ఆర్టీసీకి చెల్లించేందుకు ఈ సంస్థ ఒప్పుకోవడంతో ఆర్టీసీ కార్గో సేవలకు సంబంధించిన కాంట్రాక్టును 10 సంవత్సరాలపాటు నిర్వహించుకునేందుకు అప్పగించారు. ఇరు సంస్థల మధ్య సంతృప్తికరమైన పనితీరు ఉంటే దానిని మరో 5 ఏండ్లపాటు పొడిగించుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియ ద్వారా ఎంపికైన అవేజీ ఏజెన్సీ.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల ద్వారా పార్సిల్, కొరియర్, కార్గో సేవలను కో-బ్రాండింగ్‌తో కలిపి నిర్వహిస్తుంది. నెలకు ఇచ్చే రూ.3 కోట్లలో రూ.2.80 కోట్లు లైసెన్స్ ఫీజు కాగా, రూ.20 లక్షలు అద్దె కింద పరిగణిస్తారు.
కార్గో ప్రైవేట్‌పరం- ముఖ్యాంశాలు