హైదరాబాద్/సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్న కరోనా బీఎఫ్-7 వేరియంట్ పాతదేనని నిపుణులు చెప్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఈ వేరియంట్ మనుగడలో ఉన్నదని అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ ఏడాది జూలైలో అధికారికంగా బీఎఫ్-7 వేరియంట్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. సాంకేతికంగా బీఏ.5.2.17 వేరియంట్‌కు బీఎఫ్-7గా నామకరణం చేశారు. ఈ వేరియంట్ ఇప్పటికే 50కిపైగా దేశాల్లో విస్తరించి ఉన్నది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా చేసిన జీనోమ్ సీక్వెన్సింగ్‌లో దాదాపు 50 వేల శాంపిళ్లలో ఈ వేరియంట్‌ను గుర్తించినట్టు నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో 73 శాతం శాంపిళ్లలో ఎక్స్‌బీబీ వేరియంటే కనిపిస్తున్నదని, అయినా ఇటీవల కొవిడ్ కేసులు పెరిగిన సందర్భాలు లేవని గుర్తు చేస్తున్నారు. ‘మన దగ్గర బీఎఫ్-7 వేరియంట్ ఇప్పటికే మనుగడలో ఉన్నది. కానీ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు కనిపించలేదు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు’ అని సీఎంసీ వెల్లూరుకు చెందిన వైరాలజిస్ట్ డాక్టర్ గగన్‌దీప్ కాంగ్ తెలిపారు. ‘దేశంలో 90 శాతానికిపైగా రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. అందులో దాదాపు 90 శాతం మంది కొవిడ్ బారిన పడ్డారు. తద్వారా సహజ రోగనిరోధక శక్తి పెరిగింది. ఇలా మనదేశంలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉన్నది. కాబట్టి కొత్త వేరియంట్లు పెద్దగా ప్రభావం చూపడం లేదు’ అని పేర్కొన్నారు.
నేటి నుంచి అమల్లోకి కొత్త మార్గదర్శకాలు
అంతర్జాతీయ ప్రయాణికుల కోసం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. పూర్తి టీకా, ఆర్టీపీసీఆర్ పరీక్షలకు సంబంధించిన రుజువులను తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్ వివరాలు, పూర్తి టీకాకు సంబంధించిన వివరాలతో ‘ఎయిర్ సువిధ’ ఫారంను నింపాలని విమానాశ్రయ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
బూస్టర్ డోస్‌గా కార్బోవ్యాక్స్ మంచిది
కరోనా బూస్టర్ డోస్‌గా కార్బోవ్యాక్స్ టీకాను తీసుకోవడం ఉత్తమమని, దీని వల్ల ఐజీజీ యాంటిబాడీస్ స్థాయిలు అత్యధికంగా పెరగడమే కాకుండా మెమరీ సెల్స్ సైతం ఎక్కువ కాలం పాటు ఉంటున్నాయని ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కరోనా విషయంలో ప్రజలు భయాందోళనకు గురికావల్సిన పనిలేదని, బీఎఫ్-7 సబ్‌వేరియంట్ డెల్టా వేరియంట్ అంత ప్రమాదకారి కాదని స్పష్టం చేశారు. అయితే, కరోనా పూర్తిగా తగ్గనందున ఏటా ఒకసారి బూస్టర్ డోస్ తీసుకోవటం మంచిదని తెలిపారు. ప్రజలు కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. – ఏఐజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి
చైనా కొంపముంచిన వ్యాక్సిన్ పాలసీ
చైనాలో వ్యాక్సిన్లు ఇవ్వటం కన్నా ప్రజలను ఐసొలేషన్‌లో ఉంచి, లాక్డౌన్ విధించి రోగుల సంఖ్యను తగ్గించడంపైనే దృష్టిపెట్టారు. టీకాల పంపిణీలో వృద్ధులను నిర్లక్ష్యం చేశారు. దాంతో బీఎఫ్-7 వేరియంట్ ప్రాణాంతకంగా మారింది. ఎక్స్‌బీబీ, బీక్యూ-1 వంటి వేరియంట్లు సైతం బలమైన ప్రభావం చూపుతున్నాయి.
– డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ హెచ్‌వోడీ, నిజామాబాద్ ప్రభుత్వ దవాఖాన