మారేడ్‌పల్లి, జూలై 21: సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మాణికేశ్వరినగర్‌లో తనపై జరిగిన దాడి వెనుక ఓ మంత్రి హస్తం ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ నాయకుడి ప్రోద్బలంతోనే దాడి జరిగిందని స్పష్టంచేశారు.
తనను చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని, ఇలాంటి దాడి జరిగే అవకాశమున్నదని మూడు రోజులముందే హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్‌కు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. ఆదివారం బోనాల ఉత్సవాల్లో పాల్గొనడానికి వెళ్తుండగా రాత్రి తా ర్నాక ఆర్టీసీ దవాఖాన వద్ద 50మంది దుండగులు బైక్‌లపై వచ్చి, దాడికి యత్నించారని చెప్పారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించారు. సొంతపార్టీ ఎమ్మెల్యే.. ఓ మంత్రిపై ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం నెలకొంది.