కుక్క తోక పట్టుకొని గోదారి ఈదొచ్చా?! ‘అరె… ఈదలేమయ్యా బాబూ’ అంటే కొందరు వినరు. సస్తే నమ్మరు. ఈదమంటే ఈదరు. అయినా కుక్క తోకతో గోదావరిలో ఆ గట్టు నుంచి ఈ గట్టుకు ఈదొచ్చని వాదిస్తరు. గజఈతగాళ్లు వచ్చి అది సాధ్యం కాదని చెప్పినా నమ్మమంటరు. పైగా కుక్కతోక పట్టుకొని ఎందుకు ఈదలేదని ఎదుటి వాళ్లను నిందిస్తరు. కమిషన్లు వేసి మరీ కుక్కతోకను కీర్తిస్తరు. ప్రాణహిత జలాల మళ్లింపులో తమ్మిడిహట్టి మీద కాంగ్రెస్ నాయకుల తీరు కూడా ఇట్లనే తయారైంది.
అసలు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టమన్నదెవరో తెల్వదు. అక్కడి నుంచి నీళ్లను మళ్లించాలని అధ్యయనం చేసిందెవరో తెల్వదు. కనీసం బరాజ్ కట్టేందుకు మహారాష్ట్ర ఒప్పుకుంటుందా.. అనే ఆలోచన కూడా చేయరు. మనుషులు సంచరించడంపైనే నిషేధమున్న వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో బరాజ్ కట్టి పదహారు లక్షల ఎకరాలకు నీళ్లిస్తమని తెలంగాణ ప్రజలను మభ్య పెడతరు. అక్కడ నీళ్లే లేవయ్యా.. అని ఓ కేంద్రమంత్రి లేఖ రాసినా పట్టించుకోరు. కేంద్ర జలసంఘం లెక్కలతో సహా శాస్త్రీయంగా నచ్చజెప్పినా మనసుకు ఎక్కించుకోరు. 18 సంవత్సరాలుగా అదే వింత పోకడ, వితండ వాదన.
మరి.. గతంలో పదేండ్లు అధికారంలో ఉండీ అక్కడ మీరెందుకు కట్టలేదని అడిగితే బదులియ్యరు. కనీసం అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకున్నామన్నారు కదా.. అదైనా బయట పెట్టండంటే సమాధానం ఉండదు. సవాల్ చేస్తే పత్తా లేకుండపోతరు. మొదటినుంచీ కాంగ్రెస్ నేతల తీరిదే. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా తమ్మిడిహట్టి దగ్గర మాత్రం తట్టెడు మట్టి పని మొదలుపెట్టరు. చివరకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి మరీ.. అదే కుక్కతోకలాంటి తమ్మిడిహట్టి చాలా గొప్పదని వందల పేజీల నివేదిక తయారు చేయిస్తరు. దాన్ని పట్టుకొని గోదావరి ఎందుకు ఈదలేదని ఎదుటోళ్ల మీద నిందలు వేయిస్తరు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి వ్యవస్థ అంటేనే పాలకులకు ఓ సర్కస్ లాంటిది. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఏ ప్రాజెక్టు పొట్టవిప్పినా పొరుగు రాష్ర్టాలతో కొట్లాటలు, నీటి లభ్యత లేకపోవడం, అటవీ-పర్యావరణ చట్టాల చట్రాల్లో బంధించడం తప్ప కొసెల్లిన ప్రాజెక్టు ఒక్కటీ లేదు. పట్టుమని పదెకరాలు తడిసిన ఆయకట్టు లేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు పదవులు, కాంట్రాక్టు పనుల ఎర చూపి వినోదం చూసేవాళ్లు. అందులో నుంచి పుట్టుకొచ్చిందే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు. పదహారు లక్షల ఎకరాల ఆయకట్టు. మరి.. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టేముందు ఎక్కడ బరాజ్ కట్టాలి? ఎక్కడి నుంచి నీళ్లు మళ్లించుకోవాలి? అసలు అక్కడ ఉన్న నీళ్లెన్ని? ఎన్ని ఎత్తిపోసుకోవచ్చు? ఇంతకీ అనుకున్న ఆయకట్టుకు అవి సరిపోతయా? అని చూడాలి కదా. ఇందుకోసం సర్వేలు చేయాలి కదా. ప్రభుత్వం ఓ కమిటీని వేసి అధ్యయనం చేయించాలి కదా. ఇవేవీ జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. 18 నెలల కిందట అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టాలని ఎవరు, ఎట్ల ఎంపిక చేశారో ఇంతవరకూ చెప్పలేదు. కనీసం 665 పేజీల జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికలోనైనా ఎక్కడైనా.. మచ్చుకైనా.. తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టాలని ఫలానా నిపుణులు తేల్చారనే ఆధారాలు చూపలేదు. ఎంతసేపు తమ్మిడిహట్టి దగ్గర ఎందుకు బరాజ్ కట్టలేదు? అక్కడి నుంచి బరాజ్‌ను మేడిగడ్డకు ఎందుకు మార్చారు? ఇదే రొడ్డకొట్డుడు వితండవాదనే!
గత ఒప్పందాలనైనా పట్టించుకున్నారా?
ఒక అంతర్రాష్ట్ర ప్రాజెక్టు చేపడుతున్నపుడు ముందుగా పొరుగు రాష్ట్రంతో గతంలో ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా? అని ఒక్కసారైనా సమీక్షించుకోవడం నిర్మాణం చేపడుతున్న రాష్ట్రం బాధ్యత. కానీ ప్రాణహిత-చేవెళ్లలో గుడ్డిగా బరాజ్ ఎంపిక చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ఒప్పందాలను సైతం విస్మరించింది. గోదావరితోపాటు దాని ఉప నదులకు సంబంధించి 6.10.1975తోపాటు 7.8.1978న ఏపీ-మహారాష్ట్ర మధ్య ఒప్పందాలు జరిగాయి. ఇందులో భాగంగా ఏ రాష్ట్రమైనా ప్రాణహితపై బరాజ్ నిర్మాణం చేపట్టి తమ భూభాగంలోని ఆయకట్టుకు సాగునీరు అందించాలనుకుంటే ఇతర రాష్ట్రంలోని ముంపు అంశాన్ని పరిగణనలోనికి తీసుకోవాలి. సదరు రాష్ట్రంతో అనుమతి తీసుకొని, పరస్పర ఒప్పందంతోనే బరాజ్ నిర్మాణాన్ని చేపట్టాలని స్పష్టంగా పేర్కొనబడి ఉన్నది. కానీ అప్పటి ఏపీ ప్రభుత్వం దానిని విస్మరించి ముందుకుపోయింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి రెండు రాష్ర్టాల ఇంజినీర్లతో అంతర్రాష్ట్ర బోర్డు (ఐఎస్బీ) ఏర్పాటు చేసుకుందామని 2010 అక్టోబరులో లేఖ రాసింది. ముంపు అంశాలపై చర్చించి, ఓ నిర్ణయానికొద్దామని సూచించింది. అయినప్పటికీ రెండేండ్లపాటు ఏపీ ప్రభుత్వం కాలయాపన చేసింది. చివరకు 2012 మే నెలలో రెండు రాష్ర్టాల మధ్య అంతరాష్ట్ర ఇంజినీర్ల బోర్డు ఏర్పాటుపై ఒప్పందం జరిగింది. ముంపుపై అధ్యయనం, సమగ్ర ప్రాజెక్టుపై నివేదిక (డీపీఆర్) రూపొందించడం, ఇతర అంశాలపై పరిష్కారానికి ఈ బోర్డును ఏర్పాటు చేశారు.
కాంట్రాక్టులు.. మొబలైజేషన్ అడ్వాన్సులు
అరిగోస పడుతున్న రైతులకు సాగునీరు అందించాలనే ధ్యాస ఏనాడూ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో లేదనేందుకు ఆరు దశాబ్దాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని రైతుల దుస్థితి నిదర్శనం. ఎంతసేపు కాంట్రాక్టులు పట్టుకోవాలి, మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకోవాలనే ధ్యాస మాత్రమే. ఎక్కడైనా సాగునీటి ప్రాజెక్టుల్లో నది నుంచి నీళ్లు మళ్లించే పనులు మొదలుపెట్టి.. ఆ పైన కాల్వలు, సొరంగాలు తవ్వుకుంటరు. మరి నది నుంచి నీళ్లు మళ్లించాలంటే తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టాలి. మహారాష్ట్ర-ఏపీ సరిహద్దులో ఉన్న తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టాలంటే మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం జరగాలి. కానీ ఉమ్మడి పాలకులు అవేవీ పట్టించుకోలేదు. తెలంగాణ నేతలూ అడగలేదు. ఎంతసేపు టెండర్లు వేసి పనులు దక్కించుకోవాలనే యావ. అందులో భాగంగా 2008లో ఏకంగా ఆరుచోట్ల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు శంకుస్థాపనలు చేసి ఎడాపెడా కాలువలు, సొరంగాలు తవ్వారు. ఇట్ల 2014 అంటే తెలంగాణ ఏర్పడే వరకు ఏం చేశారంటే ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాలువలు తవ్వడమే. బరాజ్ కట్టకుండానే, దాదాపు ఏడేండ్లపాటు సుమారు రూ.7వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేశారు. అందులో సుమారు రూ.3,500 కోట్ల వరకు పనులు జరిగితే మిగిలినదంతా మొబిలైజేషన్ అడ్వాన్సులు దండుకోవడమే.
మహారాష్ట్ర సీఎం చెప్పినా పెడచెవిన..
ప్రాణహిత జలాలను మళ్లించేందుకు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్ కట్టాలని ఏ నిపుణుల కమిటీ సూచించలేదు. ముందు ఎలాంటి అధ్యయనమూ జరగలేదు. గుడ్డిగా ఆ ప్రదేశాన్ని ఎంపిక చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బరాజ్ నిర్మాణంపై మహారాష్ట్రతో సంప్రదింపులను నామమాత్రంగా కొనసాగించింది. చివరకు రెండు రాష్ర్టాలు ఏర్పాటు చేసుకున్న ఐఎస్బీలో బరాజ్ ఎత్తుపై అనేక దఫాలుగా జరిగిన సమావేశాల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. తాము ఎట్టి పరిస్థితుల్లో 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి అంగీకరించేది లేదని మహారాష్ట్ర తెగేసి చెప్పింది. ఆ మేరకు వారిని ఒప్పించడమో, ఎత్తును తగ్గించడమో ఏదోఒకటి చేసి పనులు చేపట్టాలని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం బరాజ్ నిర్మాణాన్ని గాలికొదిలేసింది. అయినా ఎడాపెడా వేల కోట్ల విలువైన కాలువలు, సొరంగాల పనులు చేస్తుండటంతో 2013లో అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటి ఏపీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి ఘాటుగా లేఖ రాశారు. ‘ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తమ్మిడిహట్టి దగ్గర నిర్మించాలనుకున్న బరాజ్ ఎత్తుపై ఇప్పటికీ రెండు రాష్ర్టాల మధ్య పరస్పర అవగాహన కుదరలేదు.
తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే.. చంద్రాపూర్ జిల్లాలోని 22 గ్రామాలు, గడ్చిరౌలి జిల్లాలోని ఎనిమిది గ్రామాల పరిధిలోని 2,099 హెక్టార్ల భూములు ముంపునకు గురవుతాయని మహారాష్ట్ర రైతాంగం పెద్దఎత్తున ఆందోళన చేపడుతున్నారు. కానీ మీరు (ఆంధ్రప్రదేశ్) 152 ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని ప్రామాణికంగా తీసుకొని ఏకపక్షంగా పనులు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రకు సంబంధించి అనేక అంశాలతో ముడిపడి ఉన్న ఈ ప్రాజెక్టుపై పరస్పర అవగాహన కుదరకుండా ఏకపక్షంగా ముందుకుపోయినట్లయితే పనుల కోసం ఖర్చు చేస్తున్న వేలాది కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది’ అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. వాస్తవాలన్నీ ఇలా ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తమ్మిడిహట్టి జపం చేయడం, దానిని ఘోష్ కమిటీ తన నివేదికలో పొందుపర్చడం చూస్తుంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే ఉన్నది.
తమ్మిడిహట్టి దగ్గర మరో పీటముడి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల చుట్టూ ఎంతటి విషవలయం ఉంటుందో అనేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ప్రత్యక్ష ఉదాహరణ. ఒకవైపు నీటిలభ్యత లేదు.. మరోవైపు బరాజ్ ఎత్తుపై మహారాష్ట్ర అంగీకారం లేదు.. వీటన్నింటికీ తోడు తమ్మిడిహట్టి దగ్గర ప్రతిపాదిత బరాజ్ ప్రాంతం చాప్రాల్ వన్యప్రాణి అభయారణ్యంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ నోటిఫై చేసింది. అంటే సాధారణంగా అక్కడ జన సంచారాన్ని అనుమతించరు. శ్రీశైలం సొరంగం నిర్మాణం రాజీవ్ టైగర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో చేపట్టినందునే జనసంచారం ఉండొద్దని డ్రిల్లింగ్, బ్లాస్టింగ్ విధానంలో సొరంగ నిర్మాణ పనులకు అనుమతులు ఇవ్వలేదు. అందుకే అక్కడ అటవీ ప్రాంతంలో భూ ఉపరితలంపైకి రాకుండా భూమి లోపలే టన్నెల్ బోరింగ్ విధానంలో సొరంగ నిర్మాణాన్ని చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అట్లాంటిది.. వన్యప్రాణి అభయారణ్యం ఉన్న ప్రాంతంలో గునపంతో తవ్వడమే అసాధ్యమంటే ఏకంగా భారీ యంత్రాలతో బరాజ్ నిర్మాణాన్ని చేపట్టాలంటే ఎన్నిరకాల అనుమతులు కావాలి! ప్రధానంగా కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖనే కాదు… సుప్రీంకోర్టు అనుమతి ఉంటే తప్ప అక్కడ పనులు చేపట్టడం సాధ్యం కాదు. మరి.. పొరుగున మహారాష్ట్రతో ఒప్పందమే చేసుకోలేని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అనుమతి సాధిస్తుందనుకోవడం నమ్మశక్యమేనా? పైగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏడేండ్లపాటు ఈ అనుమతులకు సంబంధించి అసలు ప్రయత్నాలే మొదలుపెట్టకపోవడం అంటే తమ్మిడిహట్టి బరాజ్ కట్టాలనుకున్నారా? కాల్వలు తవ్వి బిల్లులు దండుకోవాలనుకున్నారా? అనేది అర్థం చేసుకోవచ్చు. మరి.. ఈ క్రమంలో బాధ్యతాయుతమైన ఘోష్ కమిషన్ కనీసం ఈ అంశాన్ని ప్రస్తావించాలి కదా.
తమ్మిడిహట్టిపై కుండబద్దలు కొట్టిన జలసంఘం
పదేండ్లు ఉమ్మడి ఏపీలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ్మిడిహట్టి దగ్గర చిన్న బరాజ్ కట్టకపోగా.. తమ పార్టీయే అధికారంలోనే ఉన్న మహారాష్ట్రతో కనీసం ఒప్పందం కూడా చేసుకోలేకపోయింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం మహారాష్ట్రను ఒప్పించాలనుకున్నా అక్కడి ప్రభుత్వం అంగీకరించే స్థితిలో లేదు. ఈ సమయంలోనే కేంద్ర జలసంఘం పిడుగులాంటి వార్తల్ని లేఖల రూపంలో పంపింది. 4.3.2015 తేదీన, 18.2.2015 తేదీన కేంద్ర జలసంఘం రెండు లేఖల్ని తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపింది. అందులో స్పష్టంగా తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత కనిపిస్తున్నప్పటికీ.. అందులో మహారాష్ట్ర మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా తన వాటాగా ఉన్న 63 టీఎంసీలు కూడా ఉన్నాయని స్పష్టంచేసింది. ఎగువ రాష్ర్టాల్లో నీటి వినియోగాన్ని పరిశీలిస్తే 75 శాతం విశ్వసనీయత కంటే ఎక్కువగా ఉన్నందున భవిష్యత్తులో తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత 165 టీఎంసీలకుగాను 102 టీఎంసీలకు పడిపోతుందని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రాణహిత-చేవెళ్లలో భాగంగా తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో 5 టీఎంసీల నీటి నిల్వతో బరాజ్ నిర్మిస్తేనే ఈ పరిస్థితి ఉంటుందని చెప్పింది.
కానీ 148 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే బరాజ్‌లో నీటి నిల్వ కేవలం 1.4 టీఎంసీలకు పడిపోతుంది. తద్వారా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 160 టీఎంసీల జలాల మళ్లింపు అనేది అసాధ్యమని కుండబద్దలు కొట్టింది. అలాంటప్పుడు 16 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఎలా అందిస్తారని ప్రశ్నించింది. ఇవన్నీ కాకుండా 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పుకుంటున్న ఈ ప్రాజెక్టులో 16.5 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ప్రతిపాదిస్తున్నారని, అది కూడా తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బరాజ్ కడితేనే! ఒకవేళ 148 మీటర్ల ఎత్తులో కడితే నిల్వ 11.4 టీఎంసీలకు పడిపోతున్నందున ఆయకట్టుకు సాగునీరు ఎలా అందుతుందని మరో లోపాన్ని ఎత్తిచూపింది. అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి సైతం 13.3.2015న రాసిన లేఖలోనూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నదిలో పర్యావరణహిత ప్రవాహాలు (ఎకోలాజికల్ ఫ్లోస్) కూడా ఉండాల్సిన దరిమిలా 75 శాతం విశ్వసనీయతపై తమ్మిడిహట్టి దగ్గర మళ్లింపునకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చని, ఈ క్రమంలో ప్రత్యామ్నాయ వ్యూహాన్ని చూసుకోవాలని సూచించారు. అదేవిధంగా నీటి నిల్వపైనా హెచ్చరించారు. ఇవన్నీ వివరాలు కేంద్ర జల సంఘం, కేంద్ర మంత్రి లేఖల్లో కూలంకశంగా ఉన్నాయి. ఘోష్ కమిషన్‌కు ఈ లేఖలు కూడా అందాయి. అయినా కాంగ్రెస్ నేతల చేసిన తమ్మిడిహట్టి జపాన్నే ఘోష్ కమిషన్ తన భుజాన వేసుకొని నివేదికను రూపొందించినట్టు అర్థమవుతున్నది.
మహారాష్ట్రతో సంప్రదింపులు కొనసాగించిన కేసీఆర్ ప్రభుత్వం
తెలంగాణ ఏర్పడేనాటికి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంటే ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొండి కాల్వలు, సొరంగాలు తప్ప కీలకమైన బరాజ్ నిర్మాణంపై కించిత్ పురోగతి లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రభుత్వం మహారాష్ట్రతో సంప్రదింపులు కొనసాగించింది. 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణానికి ఐఎస్బీలో చర్చించింది. కానీ అప్పటి మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ ససేమిరా అన్నారు. ఆ సమయంలోనూ పలు దఫాలుగా ఐఎస్బీ సమావేశాలు జరిగాయి. ఆపై మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు రావడం అనంతరం తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడిన బీజేపీ.. అధికారంలోకి వచ్చి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనతోనూ సీఎంగా కేసీఆర్ స్వయంగా మాట్లాడినప్పటికీ.. 152 మీటర్ల బరాజ్ నిర్మాణానికి తమ ప్రభుత్వం అంగీకరించేదిలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇది తెలంగాణ సమాజం కండ్లముందు జరిగిన చరిత్ర. కాంగ్రెస్ పార్టీ నిర్వాకానికి నిలువెత్తు సాక్ష్యం. కానీ ఘోష్ కమిషన్‌లో ఇవేవీ లేవు. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్ మార్చడంలో నిజాయితీ లేదంటూ కమిషన్ చిలుకపలుకలు పలికిందే తప్ప వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా విస్మరించింది. కాంగ్రెస్ కూడా మీడియా సమావేశాల్లో పాడిందే పాడరా అన్నట్టుగా తమ్మడిహట్టిపై మాట్లాడుతున్నదే కానీ, ఎక్కడా 152 మీటర్ల బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించేలా చేసిన ప్రయత్నాలను ప్రజలముందు ఉంచడంలేదు.
పుష్కర కాలం కిందటే బండారం బయటపెట్టిన కాగ్
పదేండ్లలో ఒక్క బరాజ్ కట్టలేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూడేండ్లలోనే పూర్తయిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం కాళేశ్వరంపై విషం చిమ్మే దుస్సాహసానికి ఒడిగడుతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు నిత్యం వల్లె వేస్తున్న ప్రాణహిత-చేవెళ్ల, తమ్మిడిహట్టి బరాజ్ కథేందో.. దాని వెనక అసలు బండారం ఏందో అని 2013లోనే కాగ్ బట్టబయలు చేసింది. అదీ ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే. అయినా.. నవ్విపోదురుగాక! అన్నట్టు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును అదేదో గొప్ప నిర్ణయం అన్నట్టుగా అభివర్ణించుకోవడం విడ్డూరం. అందులోని కొన్ని ప్రధాన అంశాలను చూస్తే అసలు తమ్మిడిహట్టి దగ్గర నీటిలభ్యత లేదని కేంద్ర జలసంఘం హెచ్చరించినా ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని స్వయంగా కాగ్ తప్పుపట్టింది.
దీంతోపాటు ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయం 17,875 కోట్లు. ఆ మేరకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. కానీ అంతర్రాష్ట్ర ఒప్పందం జరగకుండానే, కీలకమైన పనులు మొదలుకాకుండానే, అసలు తమ్మిడిహట్టి దగ్గర బరాజ్‌కు శంకుస్థాపన ఫలకం పడకముందే అంచనా వ్యయం రూ.38,500 కోట్లు అంటే 115 శాతానికి ఎగబాకినట్టు స్పష్టంచేసింది. అదే విధంగా కాంట్రాక్టు పనుల అప్పగింత, గడువులోగా పనులు పూర్తికాకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా మొబిలైజేషన్ అడ్వాన్సుల చెల్లింపు ఇలా అనేక రకాల అవినీతి బాగోతాలనూ కాగ్ బయటపెట్టింది. అంటే ఒక అసంపూర్ణ నిర్ణయం.. అసంబద్ధమైన ఎంపిక.. అందులోనూ అవినీతి.. అన్నీ కలిసి కాంగ్రెస్ చెప్తున్న తమ్మిడిహట్టి!
మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలకబోసుకుంటారట. కుళ్లు రాజకీయాలతో నీళ్లను ముడిపెట్టే తిక్కమూక ఉన్నపండ్లు ఊడగొట్టుకుని కట్టుడు పండ్లతో ఇకిలిస్తారట. కండ్ల ముందున్న జలభాండం కాళేశ్వరాన్ని కాదనుకుని తమ్మిడిహట్టి అంటూ తలకు మాసిన మాటలు. కూర్చున్న కొమ్మనే తెగనరుక్కునే సయ్యాటలు. కేసీఆర్ చతురతతో వెలసిన మహాజల సౌధాన్ని కక్షలూ కార్పణ్యాలతో కూల్చేద్దామని యావ. రాష్ట్ర ప్రజల జలధీమాతో అలవిమాలిన చెలగాటం. పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టు తమ్మిడిహట్టి బులపాటం. టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలియని బిత్తిరి సంత ప్రాజెక్టు కడతామంటూ ప్రగల్భాలు. బేసిన్‌కు క్యాచ్‌మెంట్‌కు తేడా తెలియని గుండన్న కుప్పిగంతులు. అసలు వీళ్లకు తమ్మడిహట్టి ఎక్కడుందో తెలుసా? అక్కడే ఎందుకు కట్టాలో.. ఏ ప్రాతిపదికన కట్టాలో చెప్పమంటే డుమ్కీలు వేసే డమ్మీలు. అక్కడ కావాల్సినంత నీటి లభ్యత లేదనేది నిపుణులు తేల్చిన నికార్సయిన నిజం. ఆపైన కావాల్సినంత ఎత్తు కట్టుకోలేము అనేది విజ్ఞులు ఖరారు చేసిన సంగతి. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత నికరమైన సత్యం. కానీ ఇక్కడున్నది కాసుల కక్కుర్తి బ్యాచి. ఏదో ప్రాజెక్టు ముందేసుకుని జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకునే కమిషన్ల సంతతి. ఆనకట్టల వెనుక నోట్లకట్టలను చూసే, మూటలు మోసే ముఠా. ఢిల్లీ పాదుషాల కోసం గల్లీని తాకట్టు పెట్టే దగుల్బాజీ దండు. తెలంగాణ సోయిలేని పొరుగు తొత్తులు. పచ్చని తెలంగాణలో పరిగెలను పరుస్తున్న విషపు విత్తులు.
తమ్మిడిహట్టిలో నీళ్లేవి?
తమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత కనిపిస్తున్నప్పటికీ.. అందులో మహారాష్ట్ర వాటాగా ఉన్న 63 టీఎంసీలు కూడా ఉన్నాయి. భవిష్యత్తులో తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత 165 టీఎంసీలకు నుంచి 102 టీఎంసీలకు పడిపోతుంది.
– 2015 మార్చి 4న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం రాసిన లేఖ
మరోదారి చూసుకోండి..!
కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం నదిలో పర్యావరణ హిత ప్రవాహం కూడా ఉండాల్సిన దరిమిలా తమ్మిడిహట్టి దగ్గర మళ్లింపునకు 160 టీఎంసీల నీటి లభ్యత ఉండకపోవచ్చు. ప్రత్యామ్నాయ మార్గం చూసుకోండి.
– 13.3.2015న రాసిన లేఖలో అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి
కాదని ముందుకెళ్తే మీకే నష్టం!
తమ్మిడిహట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మిస్తే.. చంద్రాపూర్ జిల్లాలోని 22 గ్రామాలు, గడ్చిరౌలి జిల్లాలోని ఎనిమిది గ్రామాలు ముంపునకు గురవుతాయి. మా సమ్మతి లేకుండా మీరు 152 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మాణాన్ని ఏకపక్షంగా కొనసాగిస్తే.. దానికైన ప్రజాధనమంతా వృథా కాకతప్పదు.
– 2013లో మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చౌహాన్ అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రాసిన లేఖ