మణికొండ : కశ్మీర్లో ఉగ్రవాదులు చేసిన దాడిని ఖండిస్తూ గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల ప్రజలు, స్వచ్ఛంద సంఘాల నేతలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. పెహల్గావ్( Pehalgam) లోని బైసరీన్ వ్యాలీలో పర్యటిస్తున్న సందర్శకులపై దాడిచేసి కాల్పులు జరిపి 26 మందిని చంపడం ఉగ్రవాదుల పిరికిపంద చర్య అని ఖండించారు. ఈ సందర్భంగా మణికొండ పరిధిలోని ల్యాంకో హిల్స్ నుంచి మర్రి చెట్టు కూడలి వరకు కొవ్వొత్తులతో ( Candlelight rally ) ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతకు జై, టెర్రరిజం నశించాలంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రాంత అధ్యక్షుడు శరద్ సింగ్ ఠాకూర్, ఉపాధ్యక్షుడు శ్రీధర్ కర్ణాటపు, తెలంగాణ రియల్ ఎస్టేట్ సఫ్ఫరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్లూరు శ్రీనివాస్, చైర్మన్ బండ రాంరెడ్డి, ది సిటిజన్స్ కౌన్సిల్ అధ్యక్షుడు సీతారం ధూళిపాళ, ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, కార్యదర్శి ఉపేంద్రనాథ్ రెడ్డి, షేక్ ఆరిఫ్, బొడ్డు శ్రీధర్, విశ్వగురు ట్రస్టు వేణుగోపాల్, టీచర్స్ ఫెడరేషన్ విజయ్ సింగ్, అమిత్ భరద్వాజ్ లతో పాటు స్థానికులు పాల్గొన్నారు.