హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు అభ్యర్థులు భారీగా గైర్హాజరయ్యారు. ఆది, సోమవారాల్లో నిర్వహించిన పరీక్షల కు ఏకంగా 50శాతం అభ్యర్థులు డుమ్మాకొట్టారు. గ్రూప్-3 పరీక్షకు మొత్తం 5,36,400 మంది దరఖాస్తు చేయగా, 76శాతం అభ్యర్థులు మాత్రమే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో సోమవారం నిర్వహించిన పేపర్- 3 పరీక్షకు 2,69,483 (50.24%) మాత్రమే హాజరయ్యారు.
49.76% అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు. జిల్లాలవారీగా తీసుకుంటే నల్లగొండలో 71.30%, సూర్యాపేటలో 66.91%, మహబూబ్‌నగర్‌లో 63.58% అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశాలున్నట్టుగా తెలిసింది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్లో హైడ్రా, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రశ్నలొచ్చాయి.
సోమవారం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ పేపర్‌కు పరీక్షను నిర్వహించగా, ప్రశ్నలు మధ్యస్తంగా ఉన్నట్టుగా పోటీ పరీక్షల శిక్షకుడు ప్రభాకర్ చౌటి విశ్లేషించారు. ప్రశ్నలు అంత సులభంగా, కఠినంగా కా కుండా మధ్యస్తంగా ఉన్నట్టు అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక సర్వే, బడ్జెట్, తెలంగాణ బడ్జెట్, ఎకనామిక్ సర్వే, సోషియో ఎకనామిక్ ఔట్లుక్, కుటుంబ సర్వే నుంచి అధికంగా ప్రశ్నలిచ్చినట్టు చెప్పారు.
గణాంకాలను గుర్తుంచుకున్న వారికి మాత్రమే అనుకూలమని, మిగతా వారికి అంత సులభంకాదని తెలిపారు. సీరియస్‌గా ప్రిపేర్ అయిన వారికి 80-90 మా ర్కులు తెచ్చుకోవచ్చని, ప్రతిభావంతులు 90కి పైగా మార్కులు తెచ్చుకోవచ్చని అం చనావేశారు. సివిల్ సర్వీస్ పరీక్షల కాన్సెప్ట్ తరహాలో ప్రశ్నలొచ్చినట్టు పేర్కొన్నారు. చాలా రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నవారు ప్రయోజనం పొందుతారన్నారు.