హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఎంపిక జాబితాపై అభ్యర్థులకు ఎన్నో సందేహాలు. ఓపెన్లోనే కటాఫ్ చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగింది.. అని అభ్యర్థుల ప్రధాన ఆరోపణ. ఎక్కువ మందిని ఓపెన్ కోటాలో ఎంపిక చేశారని, సామాజిక న్యాయం జరగలేదన్న అనుమానాలు వారిలో నెలకొన్నాయి. అభ్యర్థుల ప్రయోజనార్థం.. వారు లేవనెత్తిన ప లు అనుమానాలపై అధికార వర్గాలను ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించింది. ఈ మేరకు అభ్యర్థుల సందేహాలను అధికార వర్గాలు వివరణాత్మకంగా నివృత్తి చేశాయి. అభ్యర్థుల అనుమానాలను అధికారులు కొట్టిపారేస్తున్నారు. జీవో-29 రిజర్వేషన్లకు విరుద్ధంగా లేదని, రిజర్వేషన్ విధానాన్ని పాటిస్తూనే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేశామని తేల్చి చెప్పారు. జనరల్ మెరిట్‌ను అంతా ఓపెన్ అనుకుంటున్నారని స్పష్టత ఇచ్చారు. అభ్యర్థులు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని వివరించారు.
గ్రూప్-1 మెయిన్స్ ఎంపికలో సామాజిక న్యాయం జరగలేదు. రిజర్వేషన్లు పాటించకపోవడం, ఓపెన్ కటాఫ్ ప్రకారం ఎంపిక చేయడంతో ఎస్సీ, ఎస్సీ, బీసీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచారు.?
అలాంటిదేం జరగలేదు. జీవో-29లోనూ రిజర్వేషన్లు పాటించాలనే ఉన్నది. మొదట జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక చేశాం. ఆ తర్వాత ఏ సామాజిక వర్గానికి ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టుల ప్రకారం 1:50 ప్రకారం ఉన్నారో లేదో చూశాం. షార్ట్‌ఫాల్ ఉంటే కింది నుంచి అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేశాం. ఉదాహరణకు మల్టీజోన్-1లో బీసీ (ఏ) క్యాటగిరీలో 5 పోస్టులుంటే 250 మంది బీసీ (ఏ) అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉన్నది. ఓపెన్ మెరిట్లో 190 మంది మాత్రమే ఎంపికై ఉంటే, బీసీ (ఏ) సామాజిక వర్గానికి చెందిన మరో 60 మందిని మెరిట్ ప్రకారం ఎంపిక చేశాం. అన్ని సామాజిక వర్గాలకు ఇదే ఫార్ములా పాటించాం. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేయడంతో ఇదే విధానాన్ని పాటించాం.
జనరల్ మెరిట్ అంటే అంతా ఓపెన్ క్యాటగిరీ అభ్యర్థులే అయ్యి ఉండొచ్చు కదా?
ఇది పూర్తిగా తప్పు. జనరల్ మెరిట్ అంటే పూర్తిగా ప్రతిభావంతులని అర్థం. ఈ ప్రతిభావంతుల్లో అత్యధికులు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలూ అయి ఉండొచ్చు. వీరంతా పూర్తిగా మెరిట్ అభ్యర్థులని అర్థం. మెరిట్లో ఏ కులాల వారు ఉన్నా తీసుకున్నాం.
జనరల్ మెరిట్లో ఒక క్యాటగిరీలో పోస్టులకు మించి అభ్యర్థులు ఉంటే తొలగిస్తారా?
అలా అస్సలు జరగదు. వారంతా మెరిట్ వారు కనుక తొలగించడం ఉండదు. పోస్టుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక కాకపోతే మాత్రం మెరిట్ ఆర్డర్లో కింద ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తాం.
జీవో-55ను ఎందుకు రద్దు చేశారు. కొత్తగా జీవో-29ని ఎందుకు తెచ్చారు?
గతంలో గ్రూప్-1 నియామకాల కోసం మెయిన్స్ ఎంపిక కోసం కులాలతో సంబంధం లేకుండా మెరిట్ ప్రకారం 1:50ని ఎంపిక చేయాలని 1997లో అప్పటి ప్రభుత్వం జీవో-570 జీవో జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బాలోజీ బదావత్ సహా 30 మంది అభ్యర్థులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు డివిజన్ బెంచ్ రిజర్వేషన్లను పాటిస్తూ 1:50 చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఏపీపీఎస్సీ 2009లో సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కులాలతో సంబంధం లేకుండా జనరల్ మెరిట్ ప్రకారమే ఎంపిక చేయాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పును అమలు చేయాలని గత గ్రూప్-1 నోటిఫికేషన్ సమయంలోనే కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే న్యాయ పరమైన చిక్కులెదురుకావొద్దనే గతంలో ఉన్న జీవో-55ను సవరించి జీవో-29ని జారీచేశాం.
గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 కాకుండా 1:100 రేషియోను ఎందుకు అమలు చేయడం లేదు.
గ్రూప్-1 నోటిఫికేషన్లో 1:50 నిష్పత్తిని అమలు చేస్తామని ముందే ప్రకటించాం. జీవో-29లోనూ దీనినే స్పష్టంచేశాం. ఎలా ఎంపిక చేయాలన్న దానిపై సుప్రీంకోర్టు పిట్టా నవీన్‌కుమార్ వర్సెస్ రాజనర్సయ్య కేసులో స్పష్టమైన తీర్పు ఇచ్చింది. 2003లో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయగా, ఏపీపీఎస్సీ 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆ తర్వాత కొందరు అభ్యర్థులు ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన వారిని మెయిన్స్‌కు అనుమతించాలని ఏపీ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చింది. దీనిని ఏపీపీఎస్సీ సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, ఇది న్యాయసమ్మతం కాదని, మధ్యలో ఇష్టానుసారంగా నిష్పత్తిని మార్చరాదని, ఎంపిక చేసిన వారిని జాబితా నుంచి తొలగించాలని తీర్పును ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్లో ఉన్నట్లుగానే 1:50 నిష్పత్తిని అమలు చేస్తున్నాం.
మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో జీవో-5 ప్రకారం చేపడుతున్నారు కదా?
మన దగ్గర మెయిన్స్‌కు 1:50 చొప్పున ఎంపిక చేస్తుండగా, ఏపీలో ఈ విధానం అమలులో లేదు. అక్కడ కటాఫ్ మార్కులను అమలు చేస్తున్నారు. కటాఫ్ మార్కులు కమిషన్ అభీష్టం మేరకే జరుగుతుంది. కటాఫ్ మార్కుల ప్రకారం తీసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల కోటాలో అభ్యర్థులు రిజర్వేషన్ ప్రకారం ఎంపిక కాకపోతే కటాఫ్ మార్కుల నిబంధనలను సడలించి ఆయా వర్గాల నుంచి మరికొందరికి అవకాశం ఇస్తున్నారు. ఇదే ఫార్మూలాను జీవో-29లోనూ అనుసరించాం. యూపీఎస్సీ సైతం 1:12 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి, ఇదే తీరును అనుసరిస్తున్నది.
గ్రూప్-1లో మళ్లీ ఇంటర్వ్యూలు ఉంటాయా?
ఇంటర్వ్యూలు ఉండవు. ఇంటర్వ్యూలను గతంలోనే ప్రభుత్వం రద్దుచేసింది. ఇదే విధానం అమలులో ఉంటుంది.
గ్రూప్-1 మెయిన్స్‌కు క్వాలిఫై అయిన వారి వివరాలను క్యాటగిరీ వారిగా కటాఫ్ మార్కులను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకు వెల్లడించడం లేదు
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు పూర్తికాగానే ఫలితాల సమయంలో పూర్తి వివరాలను ప్రకటిస్తుంది. అదే సమయంలో ప్రిలిమ్స్ కటాఫ్, మెయిన్స్ కటాఫ్. క్వాలిఫై అయిన వారి పూర్తి వివరాలను వెల్లడిస్తాం. పూర్తి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. దీంట్లో దాపరికం, గోప్యత లేనే లేదు.
తొలుత జనరల్/ఓవరాల్ మెరిట్ ప్రకారం మల్టీజోన్ వారీగా 1:50 నిష్పత్తి చొప్పున అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఈ జాబితాలో అన్నికులాలకు చెందిన వారు ఉంటారు. ఇది పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
రిజర్వేషన్లను అమలు చేస్తారు. ఈ విధానంలో జనరల్ మెరిట్ ప్రకారం ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఆయా రిజర్వేషన్లో ఎన్ని పోస్టులుంటే అన్ని పోస్టులకు 1:50 నిష్పత్తిని అమలు చేస్తారు. ఇలా ఉన్నారో లేదో పరిశీలిస్తారు.
లేకపోతే (షార్ట్‌ఫాల్ ఉంటే) మాత్రం ఆయా నిష్పత్తి ప్రకారం ఎంత మంది కావాలంటే అంత మందిని మెరిట్ ఆధారంగానే కింది నుంచి ఎంపిక చేస్తారు. అదనంగా ఎంత మంది అవసరముంటే అంత మందిని మెయిన్స్ కోసం తీసుకుంటారు.