Group-2 | హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): గ్రూప్ -2 పోస్టులకు 2019లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వెలువరించిన ఫలితాలను హైకోర్టు రద్దు చేసింది. 2015-16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షల ఆధారంగా జరిగిన నియామకాలను రద్దు చేస్తూ జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం సంచలన తీర్పు వెలువరించారు. డబుల్ బబ్లింగ్, వైట్నర్ వినియోగం, తుడిచివేతలున్న పార్ట్-బీ పత్రాలను పునఃమూల్యాంకనం చేయడం చెల్లదని హైకోర్టు తీర్పులో పేరొంది. జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగినట్టు కనిపిస్తున్నప్పుడు వాటిని పకన పెట్టకపోవడం సర్వీస్ కమిషన్ తప్పిదమని స్పష్టం చేసింది. కమిషన్ 24 అక్టోబర్ 2019లో ఇచ్చిన ఫలితాలు ఏకపక్షమని తేల్చింది. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు అనుగుణంగా పునఃమూల్యాంకనం చేయాలని సర్వీస్ కమిషన్‌ను ఆదేశించింది. ఆ తరువాతనే అర్హుల అభ్యర్థుల లిస్ట్ విడుదల చేసి తాజాగా నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ ఎనిమిది వారాల్లో పూర్తి చేయాలని చెప్పింది. జవాబు పత్రాల దిద్దుబాటు, వైట్నర్ వినియోగం, డబుల్ బబ్లింగ్ జరిపినవాటిని మూల్యాంకనం చేయడం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరుతూ పలువురు అభ్యర్థులు వేర్వేరుగా దాఖలు చేసిన ఆరు వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక మంగళవారం తీర్పు వెలువరించారు.
ఇదీ నేపథ్యం..
గ్రూప్-2 కింద 13 క్యాటగిరీల్లో 1032 పోస్టుల భర్తీకి 2015లో సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ తర్వాత ఏడాది అనుబంధ నోటిఫికేషన్ జారీ అయ్యింది. 2016 నవంబర్ 11, 13 తేదీల్లో రాత పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్ షీట్లకు పొంతన కుదరకపోవడంతో అదే ఏడాది డిసెంబర్లో కమిషన్.. సాంకేతిక కమిటీని నియమించింది. ఆ తర్వాత ఏడాది మార్చిలో కమిటీ సమర్పించిన నివేదికలో.. ఓఎంఆర్ షీట్ పార్ట్-ఏలోని అభ్యర్థి వ్యక్తిగత వివరాలకు సంబంధించి చిన్నచిన్న పొరపాట్లు ఉంటే ఫర్వాలేదని, పార్ట్-బీలోని 150 ప్రశ్నల జవాబులకు ఏదైనా తుడిచివేత, వైట్నర్ వాడితే వాటిని మూల్యాంకనం చేయరాదని స్పష్టం చేసింది. జవాబు పత్రాల్లో దిద్దుబాటు, తుడిచివేతలను ఆమోదిస్తే మూల్యాంకనం విశ్వసనీయత దెబ్బతింటుందని తెలిపింది. ప్రశ్నాపత్రంలో బుక్లెట్ నంబరు, ఓఎంఆర్ నంబరు ఒకేలా ఉండాలని అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు భావించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేయగా, సింగిల్ జడ్జి విచారించి మాన్యువల్‌గా మూల్యాంకనం చేయాలని తీర్పు చెప్పారు. దీనిపై సర్వీస్ కమిషన్ డివిజన్ బెంచ్‌లో అప్పీల్ దాఖలు చేసింది. కమిటీ సిఫారసులకు అనుగుణంగా మూల్యాంకనం చేయాలని 2019 జూన్ 6న తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో సర్వీస్ కమిషన్ అర్హులను ఎంపిక చేసింది. ఓఎంఆర్ షీట్లలో వైట్నర్, తుడిచివేతలకు పాల్పడిన అభ్యర్థుల పత్రాలను మూల్యాంకనం చేయడం చెల్లదంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్లు దాఖలు చేశారు. గ్రూప్-2 పోస్టుల ఎంపిక ప్రక్రియ లోపభూయిష్టమని వాదించారు. వైట్నర్ వినియోగం, దిద్దుబాట్లకు రబ్బరు, బ్లేడ్లు వినియోగించడం చెల్లదని చెప్పారు.
వీగిన కమిషన్ వాదన
‘సర్వీస్ కమిషన్ విధానాలకు అనుగుణంగా గ్రూప్-2 పోస్టుల భర్తీ జరిగింది. ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం అడ్వాన్స్డ్ అటోమేటెడ్ సానింగ్ వ్యవస్థ ద్వారా జరిగింది. ఏకరూప మూల్యాంకనం జరిగేలా చర్యలు తీసుకున్నాం. ఓఎంఆర్ షీట్లో సాంద్రత ఆధారంగా సానింగ్ జరుగుతుంది. భౌతికంగా రీవాల్యుయేషన్ చేయాలనే ఆదేశాల్ని డివిజన్ బెంచ్ రద్దు చేసింది. మూల్యాంకనంలో పక్షపాతానికి తావులేదు. ఇప్పటికే నియామకాలు జరిగి విధులు నిర్వహిస్తున్నారు. గ్రూప్-2 రద్దు చేస్తే పాలనాపరంగా గందరగోళానికి తెరలేస్తుంది. ప్రజాహితాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కోర్టుకు వచ్చిన పిటిషనర్లు అర్హత సాధించలేదు. పిటిషన్లను డిస్మిస్ చేయాలి’ అని సర్వీస్ కమిషన్ వాదన చేసింది.ట్యాంపరింగ్ సుస్పష్టం
‘జవాబు పత్రాల్లో ట్యాంపరింగ్ జరిగినట్టు స్పష్టంగా కనబడుతున్నది. అలాంటి వాటిని పకన పెట్టకపోవడం కమిషన్ వైఫల్యమే. సాంకేతిక కమిటీ సిఫారసులను అనుమతించాలని గతంలోనే హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం పార్ట్-బీలోని జవాబులను మూల్యాంకనం చేయకూడదు. సాంకేతిక కమిటీ సిఫారసులకు భాష్యం చెబుతూ పరిధిని విస్తరించేందుకు వీల్లేదు. పార్ట్-బీలోని జవాబుల మూల్యాంకనంపై కమిటీ స్పష్టంగా నిషేధం విధించింది. మూల్యాంకనం కోసం ఆటోమేటెడ్ యంత్రాల ద్వారా అనుమతించిన, అనుమతించని మారుల మధ్య తేడా స్పష్టంగా ఉన్నదని కమిషన్ వాదన ఆమోదయోగ్యం కాదు. న్యాయ, సాంకేతిక కమిటీల నిషేధాలను ఆటోమేటెడ్ యంత్రాలు అధిగమించలేవు. తేజ్ప్రకాశ్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ కేసులో హైకోర్టు ప్రభుత్వ నియామకాల్లో రాజ్యాంగ హకులైన పారదర్శకత, సమానత్వం ఉండాలని చెప్పింది. కాబట్టి 2019 అక్టోబర్ 24న విడుదల చేసిన ఎంపిక జాబితా చెల్లదు. దీనిని రద్దు చేస్తున్నాం. హైకోర్టు, సాంకేతిక కమిటీ సిఫారసుల మేరకు 8 వారాల్లో తిరిగి మూల్యాంకనం చేయాలి. అందులో అర్హత సాధించిన వారిని గ్రూప్-2 పోస్టులకు ఎంపిక చేయాలి. భవిష్యత్తులో అక్రమాల నివారణకు ఓఎంఆర్ షీట్లో పేరొన్న సూచనల మేరకే చర్యలుండాలి. భౌతిక, వీడియోగ్రఫీ పర్యవేక్షణ కూడా ఉండాలి’ అని జస్టిస్ భీమపాక తీర్పు చెప్పారు.
గ్రూప్-1 పరీక్షల కేసు విచారణ వాయిదా
గ్రూప్-1 నియామకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ), ఎంపికకు అర్హత సాధించిన అభ్యర్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణను హైకోర్టు వచ్చే నెల 22కు వాయిదా వేసింది. గ్రూప్-1 పోస్టుల భర్తీ నియామకాలు తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటాయన్న ఉత్తర్వులను కూడా పొడిగించింది. ప్రతివాదులైన పిటిషనర్లు రాతపూర్వక వాదనలను సోమవారం సమర్పించారని, విచారణను వాయిదా వేయాలని సర్వీస్ కమిషన్ తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి కోరారు. గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాలను మోడరేషన్ పద్ధతిలో పునఃమూల్యాంకనం చేశాక వచ్చిన ఫలితాల ఆధారంగా గ్రూప్-1 పోస్టుల నియామకాలు చేపట్టాలని, లేనిపక్షంలో తిరిగి పరీక్షలను నిర్వహించి పోస్టుల భర్తీ పూర్తి చేయాలని గతంలో సింగిల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిని సవాలు చేస్తూ సర్వీస్ కమిషన్, మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థులు అప్పీళ్లు దాఖలు చేశారు.