హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది జులై 17న నిర్వహించిన రాత పరీక్షను రద్దు చేస్తున్నట్టు సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. కొంతమంది రాష్ట్ర విద్యుత్తు సంస్థ ఉద్యోగులు, ఇతరులు కలిసి సుమారు 181 మంది అభ్యర్థులకు సమాధానాలుచేరవేసినట్టు రాచకొండ పోలీసుల విచారణలో తేలిందని వెల్లడించారు.
ఈ వ్యవహారంలో మరింత మంది అభ్యర్థు ల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎండీ తెలిపా రు. రాతపరీక్షలో అక్రమాలపై కొంతమంది కార్పొరేట్ కార్యాలయం వద్ద ధర్నాచేశారు. పరీక్షను రద్దు చేయాలని కోరారు. ఈ వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డ పలువురు విద్యుత్తు సంస్థల ఉద్యోగులను సస్పెండ్ చేశారు.