హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): శాసనమండలి సభ్యులు తాతామధు, నవీన్‌రెడ్డి వ్యవహారంపై ఏర్పాటుచేసిన ఎథిక్స్ కమిటీ సమావేశం బుధవారం వాడీవేడిగా జరిగినట్టు తెలిసింది. కమిటీ చైర్మన్ మహేశ్‌కుమార్‌గౌడ్ నేతృత్వంలో జరిగిన సమావేశానికి సభ్యు లు నెల్లికంటి సత్యం, దేశపతి శ్రీనివా స్, కార్యదర్శి నర్సింహాచార్యులు, అధికారులు హాజరయ్యారు. తాతా మధు, నవీన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ శాసనసభ చేసిన తీర్మానానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై చర్చ జరిగినట్టు సమాచారం. శాసనసభలో సభ్యుడుకాని వ్యక్తి గురించి సభలో తీర్మానం చేసి పంపిస్తే శాసనమండలి ఎలా చర్యలు తీసుకుంటుందని సభ్యులు ప్రశ్నించినట్టు తెలిసింది.
ఒక వ్యక్తి చేసిన తప్పునకు ఒకసారే చర్యలు తీసుకోవాలని ఆర్టికల్ 20 (2)లో పేర్కొన్నారు. శాసనమండలిలో ఇప్పటికే తాతామధు, నవీన్‌రెడ్డిని సమావేశాలు ము గిసేవరకు సస్పెండ్ చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని ఎథిక్స్ కమిటీకి రిఫర్, చర్చించడం వృథా అని సభ్యులు అభిప్రాయపడినట్టు సమాచారం. మరోసారి శిక్ష వేసేందుకు యత్నించడం డబుల్ జియోపార్టీ అవుతుందని సభ్యులు పేర్కొన్నట్టు తెలిసింది.
పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం ఏదైనా అంశంపై, ప్రవర్తనలపై ముందుగా ఎథిక్స్ కమిటీ సుదీర్ఘంగా చర్చించి, విచారణ నిర్వహించాలి. తరువాత సిఫార్సులను సభ ముందు పెట్టాలి. ఆ తర్వాతే చర్యలపై సభ నిర్ణయం తీసుకోవాలి. తాతామధు, నవీన్‌రెడ్డి వ్యవహారంలో సభ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నది. శిక్ష వేసిన తర్వాత విచారణ జరుపడం సహజన్యాయ సూత్రాలకు విరుద్ధమని దేశపతి శ్రీనివాస్ అన్నట్టు తెలిసింది. సదరు ఎమ్మెల్సీలకు తమ వాదనను వినిపించే అవకాశం ఇవ్వకుండానే సస్పెండ్ చేశారని, ఇది కూడా పరిశీలించాల్సిన అంశమని దేశపతి, నెల్లికంటి సత్యం అన్నట్టు తెల్సింది. రాజకీయ కక్షలకు ఎథిక్స్ కమిటీ వేదికగా ఉండవద్దని పేర్కొన్నట్టు సమాచారం.
శాసనమండలి హాలు, ప్రాంగణం పరిధిలో జరిగిన అంశాలపైనే ఎథిక్స్ కమిటీ చర్చిస్తుందని, సభలో కార్యకలాపాలకు సభ్యుడు విఘాతం కలిగించినపుడు మాత్రమే కమిటీకి రిఫర్ చేయడం సాధ్యమవుతుందని, సభ వెలుపల జరిగినదానికి ఎథిక్స్ కమిటీకి సంబంధం ఉండదని, ప్రాంగణంలో జరిగినా కూడా అవి తమ పరిధిలోకి రావని సభ్యులు చెప్పినట్టు తెలిసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎథిక్స్ కమిటీ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. శాసనసభ నియమావళిలోని ఆర్టికల్ 194 ప్రకారం ఏ సభలో సభ్యుడై తే ఆ సభలోనే తీర్మానం ప్రవేశపెట్టాలి, శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా చర్యలు తీసుకోవడం చట్టరీత్యా చెల్లదని అభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం.
తాతామధు, నవీన్‌రెడ్డిల అంశంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారని, న్యాయస్థానం పరిధిలో ఉన్న అంశాన్ని ఎథిక్స్ కమిటీకి ఎలా రిఫర్ చేశారని సభ్యులు అడిగినట్టు సమాచారం. కోర్టుకు సమాంతరంగా ఎథిక్స్ కమిటీ విచారణ చేయడం సరికాదన్న అభిప్రాయం వ్యక్త మైనట్టు తెల్సింది. కమిటీ వద్ద ఉన్న ఈ విచారణను కొట్టివేయాలని దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేసినట్టు తెలిసింది.