హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం ముగియడంతో రాజకీయ పార్టీలు తమకు ఎన్ని సీట్లు, ఎన్ని ఓట్లు వస్తాయనే అంచనాల్లో తలమునకలయ్యాయి. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటరు నాడిని పట్టుకోవడం కొంచెం కష్టంగానే ఉన్నప్పటికీ, వివిధ పార్టీల అభ్యర్థులు, అధినాయకత్వాలు పోలింగ్ ట్రెండ్‌పై క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకొని లెక్కలేసుకుంటున్నా యి. మంగళవారం ఉదయం నుంచి పార్టీల ముఖ్య నేతలు పోలింగ్ శాతాన్ని పరిగణనలోకి తీసుకొని, ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలో ఇటీవలి ఎన్నికల్లో పార్టీకి వచ్చిన ఓటు షేర్, ప్రస్తుత పోలింగ్ ట్రెండ్ ఆధారంగా అంచనాలు వేసుకుంటున్నారు. ఆ యా నియోజకవర్గాల్లో అభ్యర్థి, పార్టీ ప్రచారం ఎలా సాగింది? ఓటర్లను ఏయే అంశాలు ప్రభావితం చేశాయి? తదితర అంశాల ప్రాతిపదికగా ప్రస్తుతం ఎన్ని ఓట్లు వచ్చాయి? అవతలి పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు ఎన్ని? అని లెక్కలేసుకుంటున్నారు.
రాష్ట్రంలో తలపడిన మూడు ప్రధాన పార్టీల్లో అధికార పార్టీ నేతలకు ఫలితాలపై టెన్షన్ అధికంగా ఉండటం సహజం. ఫలితాల్లో తేడా వస్తే తమ పదవులకే ఎసరు వస్తుందన్న దిగులు అధికార పార్టీ నేతలను వెంటాడుతున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతోపాటు కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించింది. దీంతో ఆ రెండు పార్టీల జాతీయ నాయకత్వాలు సైతం టెన్షన్ పడుతున్నాయి. ఐదు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ తొడగొట్టి సవాల్ చేసింది. ‘ఇటీవలే మనం అధికారంలోకి వచ్చాం.
కేంద్రంలో కూడా అధికారంలోకి రావాలంటే మీరు బాగా పనిచేయాలి. మీ పనితనానికి ఫలితాలే కొలమానం’ అని కాంగ్రెస్ హైకమాండ్ మంత్రులతోపాటు ముఖ్యమంత్రికి కూడా టార్గెట్ ఇచ్చింది. నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోకపోతే ఆఖరికి మంత్రి పదవులు కూడా పోతాయి అనే రీతిలో అధిష్ఠానం ఇద్దరు, ముగ్గురు మంత్రులను సున్నితంగా హెచ్చరించినట్టు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు ఎవరికివారు తమతమ జిల్లాలు, తమ సొంత నియోజకవర్గాల్లో సర్వశక్తులు ఒడ్డారు. మరోవైపు మూడోసారి పీఠం ఎక్కడమే పరమావధిగా ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీలోని సమస్త పటాలం సర్వశక్తులు ఒడ్డింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తరువాత కొది నెలలకే వచ్చిపడ్డ పార్లమెంట్ ఎన్నికల్లో క్యాడర్లో నిరాశ, నిస్పృహలను తొలగించి పార్టీకి భవిష్యత్తు ఉన్నదని నిరూపించేందుకు బీఆర్ఎస్ పార్టీ సైతం సర్వం ధారపోసింది. పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ నాయకత్వం మొత్తం తమ శక్తిని వినియోగించింది. మూడు పార్టీలు హోరాహోరీగా తలపడటంతో క్రాస్ ఓటింగ్, సైలెంట్ ఓటింగ్ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొన్నది. మరో 20 రోజులు ఓపికపడితే కానీ రాష్ట్రంలో రాజకీయ ముఖచిత్రం ఎట్లా ఉంటుందో చెప్పలేమం టూ రాజకీయ విశ్లేషకులు సైతం ఫలితాలపై అంచనాలకు రాలేకపోతుండటం గమనార్హం.