హైదరాబాద్, అక్టోబర్ 24(నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమస్యల పరిష్కారానికే క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయనున్న ట్టు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్‌గా, మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా కే కేశవరావు ఉంటారని ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై గురువారం కమాండ్ కంట్రోల్లో సంఘాల నేతలతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగు ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం గా ఉన్నదని తెలిపారు. డీఏల అంశంపై శుక్రవారం సాయంత్రంలోగా నిర్ణయం ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 317 జీవోపై ఇప్పటికే సబ్ కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, సీఎస్ శాంతికుమారి, జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందే: స్థిత ప్రజ్ఞ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనని టీఎస్సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ ప్రభుత్వాన్ని కోరారు.
డీఏల కోసమే సబ్ కమిటీనా?: కమలాకర్
సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం చిత్తశుద్ధి కనబరచడం లేదని సీపీఎస్ ఉపాధ్యా య, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమలాకర్ పేర్కొన్నారు. డీఏల కోసమే కమిటీ వేయడాన్ని ఎన్నడూ చూడలేదని తెలిపారు. కాలయాపన కోసమే క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ ఫసీయుద్దీన్ ఒక ప్రకటనలో ఆరోపించారు.