హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీసులకు మరోమారు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. సీసీకెమెరాల ఏర్పాటుతో సమాజ భద్రతకు తీసుకుంటున్న చర్యలకుగాను ఇండియా ఔట్స్టాండింగ్ సెక్యూరిటీ పెర్ఫామెన్స్ అవార్డుకు ఎంపికైంది. ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ బీడబ్ల్యూ బిజినెస్ వరల్డ్ ఈ అవార్డును అందజేసింది. మంగళవారం వర్చువల్గా జరిగిన ప్రదానోత్సవ కార్యక్రమంలో పలువురు భద్రతారంగ నిపుణులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా కమ్యూనిటీ సీసీకెమెరాలను ఏర్పాటు చేయడంతో ఈ గుర్తింపు లభించింది. గత వారం రోజుల్లో తెలంగాణ పోలీసులు మూడు జాతీయ స్థాయి అవార్డులు గెల్చుకోవడం గమనార్హం.