
హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా కదిలే కృత్రిమ చేయిని బీవీఆర్ఐటీ నర్సాపూర్ విద్యార్థులు తయారు చేశారు. ‘ఎకనామిక్ త్రీడీ ప్రింటెడ్ ప్రోస్తటిక్ హ్యాండ్’ పేరుతో బయో మెడికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నాయిని వంశీకృష్ణ, ఎండీ అబీద్ అహ్మద్, ప్రత్యూష, సంధ్య ఈ ప్రొస్తటిక్ హ్యాండ్ను తయారుచేశారు. ఇటీవలే నిర్వహించిన అసిస్ట్ టెక్నాలజీ సమ్మిట్లో ఈ ప్రాజెక్ట్ మూడో బహుమతిని గెలుచుకొన్నది. తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ అధికారులు విద్యార్థులకు రూ.లక్ష నగదు బహుమతిని అందజేశారు. ఈ నగదు బహుమతితో కృత్రిమ చేయిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని వెల్లడించారు.
పనిచేస్తుందిలా..
మన శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా మెదడు ఆదేశాలే కీలకం. మెదడు ద్వారా వచ్చే సంకేతాలు నాడుల ద్వారా అవయవాలకు చేరుతాయి. దీంతో ఆయా అవయవాలు పనిచేస్తాయి. అయితే చేయి కోల్పోయిన వారికి సంకేతాలు ఆయా చేయి మిగిలిన భాగం వరకే వచ్చి ఆగుతాయి. ఆయా సంకేతాలను ప్రోస్తటిక్ హ్యాండ్లోని సెన్సర్లు గ్రహించి కృత్రిమ చేయి కదిలేలా విద్యార్థులు చేయిని అభివృద్ధి చేశారు. నైలాన్ తాడుతో వేళ్లను పిడికిలిలా బిగించడం, మూమూలు స్థాయికి చేర్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కృత్రిమ చేయితో వస్తువులను తీసుకోవటం, వదిలేయటం, బరువులను ఎత్తడం లాంటి పనులు చేయవచ్చని విద్యార్థులు పేర్కొన్నారు.