Trisha | కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష పేరు మరోసారి తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె త్వరలో రాజకీయాల్లోకి అడుగుపెడతారా? తిరుచ్చి ఉపఎన్నికలో అధికార పార్టీ తరఫున బరిలో నిలుస్తారా? అనే చర్చలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ప్రచారానికి ప్రధాన కారణం హీరో, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తీసుకున్న నిర్ణయమే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. అనంతరం తిరుచ్చి స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.
మొదట ఈ స్థానంలో రాఘవ లారెన్స్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి చూపినట్లు వార్తలు వచ్చాయి. అయితే చివరి నిమిషంలో ఆయన పోటీ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు తిరుచ్చి అభ్యర్థి ఎవరనే అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో త్రిష పేరు తెరపైకి వచ్చింది. విజయ్‌కు సన్నిహితురాలిగా పేరున్న త్రిషను రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఆలోచన ఉందా? ఆమె ఉపఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉందా? అనే ఊహాగానాలు తమిళ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు త్రిష గానీ, ముఖ్యమంత్రి విజయ్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానాలకే పరిమితమైంది. అయినప్పటికీ త్రిష రాజకీయ అరంగేట్రంపై తమిళనాట ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. అధికారిక ప్రకటన వస్తేనే ఈ వార్తలకు పూర్తి స్పష్టత రానుంది. ఇక సినిమాల విషయానికి వస్తే త్రిష ప్రస్తుతం సినిమాలతోను బిజీగా ఉంది. ఇటీవల కరుప్పు చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన త్రిష ఇప్పుడు చిరంజీవి విశ్వంభర సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు పలు చిత్రాలకి సైన్ చేసింది. ఈ వయస్సులోను త్రిష వరుస అవకాశాలు అందిపుచ్చుకోవడం , అలానే మంచి హిట్స్ దక్కించుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.