మంచిర్యాల అర్బన్, మార్చి 15 : లేబర్ కోడ్స్‌ను అమల్లోకి తెచ్చేలా అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేయాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు డిమాండ్‌చేశారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలో సీపీఎం మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అమెరికా- ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సామాన్యులకు దొరకని పరిస్థితి నెలకొనే ప్రమాదమున్నదని తెలిపారు.
యుద్ధం ఆపడానికి పీఎం మోదీ చొరవ చూపాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, ఆదివాసీ గిరిజనులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పేర్కొన్నారు.