కాశీబుగ్గ, ఫిబ్రవరి 5: గ్రేటర్ వరంగల్‌లోని 14వ డివిజన్ బాలాజీనగర్‌కు చెందిన వ్యాపారి గంధం కుమారస్వామి (52) సెల్ఫీ తీసుకొని ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గంధం కుమారస్వామి వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో పల్లి, పసుపు ఖరీదు వ్యాపారం చేస్తుంటాడు. 2014లో ఆర్థికంగా నష్టపోవడంతో అప్పుల పాలయ్యాడు. 2020లో జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరఫున కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. ఎన్నికల సమయంలో స్థానిక మాజీ ప్రజాప్రతినిధి దగ్గర సుమారు రూ.25 లక్షలు, మరో వ్యక్తి వద్ద రూ.7 లక్షలు అప్పు తీసుకున్నాడు. డబ్బులు చెల్లించాలని వేధిస్తున్నట్టు సెల్ఫీ వీడియోలో చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారస్వామి మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం దవాఖానలోని మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.