హుజూర్నగర్ రూరల్, సెప్టెంబర్ 22: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం బూరుగడ్డ గ్రామ నల్లచెరువుకు శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మళ్లీ గండిపడింది. గత నెల 24న కురిసిన వర్షాలతో వరద ప్రవాహానికి నల్లచెరువుకు గండి పడటంతో గోపాలపురం- బూరుగడ్డ గ్రామాల మధ్యగల రోడ్డు కొట్టుపోయింది. దాంతో పదిరోజులపాటు రాకపోకలు నిలిచిపోయి సమీప గ్రామాల ప్రజ లు ఇబ్బందిపడ్డారు.
మంత్రి ఉత్తమ్ ఆదేశాలతో ఆ తర్వాత అధికారులు తాత్కాలికంగా రోడ్డును ఏర్పాటు చేసి రాకపోకలను పునరుద్ధరించారు. కాగా శనివారం కురిసిన వర్షపు నీటితోపాటు నాగార్జునసాగర్ జలాలు వచ్చి చేరడంతో వరద పెరిగింది. కట్ట తెగిపోయే ప్రమాదం ఉండటంతో జేసీబీతో కొంత భాగాన్ని తొలగించి గండి పెట్టి నీటిని దిగువకు వదిలారు. గండి పెరిగి కర్కకాయలగూడెం, మాచవరం, బూరుగడ్డ గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. త్వరగా మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరించాలని కోరుతున్నారు.