హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల భద్రత పేరుతో వాహనదారులపై రూ.8 వేల నుంచి రూ.10 వేల భారం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రవాణా, గూడ్స్ వాహనాల్లో వెహికల్ లొకేషన్ ట్రేసింగ్ (వీఎల్టీ) డివైజ్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వనికి లేఖ రాసింది. ఇటీవల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో మహిళలపై అఘాయిత్యాలు జరగడంతో వాహనాలకు వీఎల్టీ డివైజ్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రవాణా వాహనాలు ఎకడున్నా వెంటనే గుర్తించవచ్చని, ఏ వాహనంలోనైనా అవాంఛనీయ ఘటన జరిగితే క్షణాల్లో అధికారులను, పోలీసులను అప్రమత్తం చేసి నిందితులను అదుపులోకి తీసుకునే వీలుంటుందని రవాణా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, గూడ్స్ వాహనాలతోపాటు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయించుకునే అన్ని రవాణా వాహనాల్లో వీఎల్టీ డివైజ్లను అమర్చనున్నారు. ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ పబ్లిక్ ట్రాన్స్పోర్టు, గూడ్స్ వాహనాలకు పకడ్బందీ రక్షణ వ్యవస్థ లేదని, ఒక్కో వీఎల్టీ డివైజ్ ఏర్పాటుకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చు అవుతుందని అధికారులు చెప్తున్నారు. డివైజ్ను అమర్చని కొత్త వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయరని, పాత రవాణా వాహనదారులు వీఎల్టీ డివైజ్ను అమర్చుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.