హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు వినియోగదారులపై చార్జీల భారం తప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చార్జీల పెంపులేదని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు టారిఫ్ ఆర్డర్‌పై ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ దేవరాజు నాగార్జున మంగళవారం సంతకం చేశారు. ప్రస్తుతానికి పాత టారిఫే అమల్లో ఉంటుందని, కొత్త టారిఫ్ మే 1 నుంచి అమల్లోకి వస్తుందని జస్టిస్ నాగార్జున వెల్లడించారు. కొత్త ఆర్థిక సంవత్సరానికి అగ్రిగేట్ రెవెన్యూ రిక్వెస్ట్ (ఏఆర్ఆర్)పై విద్యుత్తు సంస్థలు దాఖలు చేసిన మొత్తం 8 పిటిషన్లపై విచారణ జరిపిన ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్‌ను ఆమోదించింది. ఈ సందర్భంగా ఎర్రగడ్డలోని విద్యుత్తు నియంత్రణ భవన్లో ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున ఈఆర్సీ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. డిస్కంల రెవెన్యూ లోటు రూ.13,499 కోట్లుగా ఉండగా, ఈ మొత్తాన్ని సబ్సిడీ రూపంలో అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతానికి చార్జీలను పెంచడం లేదని తెలిపారు. లో టెన్షన్ (ఎల్టీ) -9వ క్యాటగిరీలోని ఈవీ చార్జింగ్ స్టేషన్ల లోడ్ లిమిట్‌ను 150/201 హెచ్‌పీకి పెంచారు. గ్రిడ్ సపోర్టు చార్జీలను నెలకు ఒక కిలోవాట్‌కు రూ.18.48ల నుంచి రూ.20.02కు పెంచారు.
డిస్కంల ఆర్థిక పరిస్థితి బాగాలేదు..
రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున ఆందోళన వ్యక్తంచేశారు. బకాయిలు పేరుకుపోతున్నాయని, మరీ ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు తీవ్ర సమస్యగా మారినట్టు తెలిపారు. బకాయిలను వసూలు చేయడమో.. లేక సర్కారు చెల్లించడమో చేయాలని పేర్కొన్నారు. విద్యుత్తు సంస్థలు ట్రాన్స్మిషన్, కమర్షియల్ నష్టాలను తగ్గించుకోవాలని సూచించారు. వినియోగదారులకు అందుతున్న సేవలపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ట్రాన్స్ఫార్మర్లను మార్చడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయని వెల్లడించారు.