ఇంధన కొరత నెపంతో హజ్ యాత్రికులను కేంద్రం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నది. ఓవైపు పుష్కలంగా చమురు నిల్వలు ఉన్నాయని చెబుతూనే మక్కా యాత్రికులపై రూ.10వేల అదనపు భారాన్ని మోపుతున్నది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రం నుంచి యాత్ర చేసేవారిపై రూ.6,63,20,000 భారం పడనున్నది. దీంతో దాతల సాయంతో హజ్ కు వెళ్లే నిరుపేదలు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తక్షణం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వమైనా ఆ భారాన్ని మోయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ): హజ్ యాత్రికులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇంధన కొరత సాకుతో ఒకొకరు రూ.10వేల చొప్పున అదనంగా చెల్లించాలని నిర్ణయిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మోదీ సరార్ వైఖరిపై హజ్ యాత్రికుల్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతున్నది. దేశంలో మూడు నెలలకు సరిపడా పుషలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని చెబుతూ వస్తున్న కేంద్రం పవిత్ర యాత్రకు వెళ్లేవారిపై భారం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
యాత్రకు ఏటా 2లక్షల మంది
సౌదీ ఆరేబియాలోని మకా మదీన యాత్రకు ఏటా భారతదేశaంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 2 లక్షల మందికిపైగా ముస్లింలు వెళ్తుంటారు. నాలుగైదు నెలల క్రితమే ఇందుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతున్నది. హజ్ కమిటీల ఆధ్వర్యంలో జనవరిలో దరఖాస్తులు స్వీకరించి స్రూటిని పూర్తిచేసి అర్హులను ఎంపిక చేస్తారు. యాత్రకు ఎంపికైనవారు రూ.3.6 లక్షల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. తెలంగాణ నుంచి ఈ ఏడాది 6,632 మంది యాత్రికులను ఎంపిక చేశారు. వీరంతా సోమవారం ప్రత్యేక విమానాల్లో బయల్దేరి వెళ్తారు. నిరుపేదలైన అనేకమంది యాత్రికులు దాతల సహాయంతో మక్కా యాత్ర చేస్తారు. ఇపుడు కేంద్రం అదనంగా రూ.10వేలు చెల్లించాలని నిర్దేశించడంతో దాతలపై ఆధారపడే యాత్రికులు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇంధన కొరత పేరిట తమను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదని మక్కా యాత్రికులు ఆవేదన వ్కక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదనపు భారాన్ని ఉపసంహరించుకోవాలని మై నార్టీ సంఘాల నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వమైనా ముందుకొచ్చి ఆర్థిక భారాన్ని భరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కేంద్రంపై ఒత్తిడి తేవాలి
హజ్ యాత్రికులపై కేంద్రం ఏటీఎఫ్ చార్జీల పేరిట రూ.10 వేల అదనపు భారం మోపడం సరికాదని మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్‌పాషా పేర్కొన్నారు. దాతల సహాయంతో మక్కాకు వెళ్లే నిరుపేద ముస్లింలు అదనపు సొమ్ము చెల్లించడం ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఇంధన చార్జీలు ఉపసంహరించుకొనేలా కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని, లేదంటే రాష్ట్రం నుంచి వెళ్లేవారికి సంబంధించిన భారాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.