మహబూబ్‌నగర్ అర్బన్, జూన్ 14 : పాలమూరులో వీధి వ్యాపారులపైకి బుల్డోజర్ వెళ్లడంతో పండ్ల వ్యాపారులు నిరసన వ్యక్తంచేశారు. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కమర్షియల్ దుకాణాలు నిర్మించారు. ఇక్కడే కొన్నేళ్లుగా కొందరు పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. షటర్ల నిర్మాణం చివరి దశకు చేరడంతో శనివారం ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు, పోలీసులు పండ్లబండ్లు తొలగించేందుకు జేసీబీతో వచ్చారు.
దీంతో పండ్ల వ్యాపారులు బుల్డోజర్ను అడ్డుకొని అక్కడే బైఠాయించి నిరసనకు దిగారు. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి చేరుకొని మున్సిపల్ అధికారులను, పోలీసులను వారించారు. దీంతో అధికారులు వెనుకడుగు వేశారు. ఆర్టీసీ కమర్షియల్ షెటర్ల కోసం రూ.3 లక్షల డిపాజిట్‌తో టెండర్లు వేశామని ఆర్టీసీ ఆర్ఎం సంతోష్‌కుమార్ తెలిపారు. ఇక్కడ పండ్ల బండ్లు ఉంచితే దుకాణాలు దక్కించుకున్న వా రు వ్యాపారాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు.
బతుకుదెరువు కోసం వ్యాపారం చేసుకుంటుంటే మున్సిపల్ అధికారులు మా పొట్ట కొట్టేందుకు చూస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు పర్యటనకు వచ్చిన సమయంలో ఫుట్‌పాత్‌పై బతికేటోళ్ల జోలికి వెళ్లొద్దని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పుడు మా వ్యాపారాలు తొలగించాలని వస్తే ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే యెన్నం ఎక్కడున్నారు. చిరువ్యాపారులను చంపేస్తారా..? సీఎం వ స్తాడా..? రమ్మనండి.. గతంలో శ్రీనివాస్‌గౌడ్ మాకు అండగా నిలిచారు. ఆయన హ యాంలో ఎవరూ మాజోలికి రాలేదు.
– నర్సమ్మ, చిరువ్యాపారి, మహబూబ్‌నగర్