రీజినల్ రింగ్ రోడ్డు కొత్త అలైన్‌మెంట్‌కు వ్యతిరేకంగా వికారాబాద్ జిల్లా రైతులు వారం నుంచి కలెక్టరేట్‌తోపాటు హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్నారు. రోజుకో మండలానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్నారు. గురువారం నవాబుపేట్ మండలం చించల్పేట్ గ్రామ రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్‌కు వినతిపత్రం అందజేశారు. పాత అలైన్మెంట్ ప్రకారం రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించాలని కోరారు. కొత్త అలైన్‌మెంట్‌ను అంగీకరించేది లేదని స్పష్టంచేశారు. ట్రిపుల్ ఆర్ కోసం పట్టాభూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటే కలెక్టరేట్ ఎదుట పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు.
– వికారాబాద్
హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ): రీజినల్ రింగురోడ్డు (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టు సమస్యల వలయంలో చుట్టుకున్నది. 22 నెలలుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఒకవైపు రైతులు బహిరంగ మార్కెట్ ప్రకారమే ధర చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొన్ని చోట్ల అసలు భూములిచ్చేదే లేదని అన్నదాతలు ఆందోళన చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించిన కేంద్ర ప్రభుత్వం.. ఇదివరకే దాఖలైన టెండర్లను తెరవకుండా కాలయాపన చేస్తున్నది. రాష్ట్ర సర్కారు మాత్రం సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నది.
ట్రిపుల్ ఆర్కు అనుమతులు ఇవ్వాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరుతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 22 నెలలు పూర్తికావస్తున్నా ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నది. ఇప్పటికే అవార్డ్ పాస్ చేసిన భూముల రైతులు మార్కెట్ ధర ప్రకారమే చెల్లించాలని కోరుతున్నారు. ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగాన్ని సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా తంగడపల్లి వరకు 161.518 కి.మీ. వరకు నిర్మించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది.
నిరుడు డిసెంబర్ 27న ఆన్లైన్ పద్ధతిలో టెండర్లను కూడా ఆహ్వానించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు టెండర్ల దాఖలుకు చివరి గడువుగా విధించింది. గడువు పూర్తయి 7 నెలలు దాటుతున్నా ఇంతవరకు ఆ టెండర్లను తెరవనేలేదు. ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్) పద్ధతిలో 5 ప్యాకేజీలుగా పనులు చేపట్టి రెండేండ్లలో రహదారిని సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇంతవరకు టెండర్ల ప్రక్రియే కొలిక్కి రాకపోవడం గమనార్హం.
రూ.7,104.06 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను నిర్మించాలని మొదట నిర్ణయించారు. అనంతరం పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఆరు లేన్లుగా నిర్మించాలని నిర్ణయించారు. దీనిప్రకారం రహదారి అలైన్‌మెంట్‌ను మార్చాల్సి ఉన్నందున పాత టెండర్లను రద్దుచేసి కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి. మరోవైపు, ట్రిపుల్ ఆర్కు కేంద్ర క్యాబినెట్ నుంచి అనుమతులు రావాల్సి ఉన్నది. ఇంకా 10 శాతం వరకు భూసేకరణ పూర్తిచేయాల్సి ఉన్నది. రైతులు భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఇదివరకే భూములిచ్చేందుకు ఒప్పుకున్న రైతులు సైతం, ఇప్పుడు బహిరంగ మార్కెట్ ప్రకారం ధర చెల్లిస్తే తప్ప తాము భూములిచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. పూర్తిగా భూసేకరణ పూర్తయిన ప్రాజెక్టులనే చేపట్టాలని గతంలో పార్లమెంటరీ హౌస్ ప్యానల్ కేంద్రానికి సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా నడుచుకోవాలని కేంద్రం భావిస్తున్నందున ట్రిపుల్ ఆర్కు మొత్తం భూసేకరణ పూర్తయ్యాకే క్యాబినెట్ అనుమతులు వచ్చే అవకాశం ఉన్నదని సమాచారం.
ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం కోసం దాదాపు 1,950 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉన్నది. ఇందులో 95 శాతం వరకు భూసేకరణ పూర్తయినట్టు ప్రభుత్వం చెప్తున్నది. కాగా, సిద్దిపేట, యాదాద్రి, రాయగిరి తదితర ప్రాంతాల్లో భూసేకరణకు వ్యతిరేకంగా కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు స్టే ఇచ్చింది. గతంలో అవార్డ్ పాస్‌చేసిన భూముల రైతులు సైతం ఇప్పుడు భూములను వదులుకునేందుకు నిరాకరిస్తున్నారు. నష్టపరిహారం పెంచాలని ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్బిట్రేషన్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ భూములు హైదరాబాద్‌కు కేవలం 50 కిలోమీటర్ల పరిధిలోనే ఉండటంతో వాటి ధర బహిరంగ మార్కెట్లో ఎకరాకు రూ.కోటి వరకూ పలుకుతుండగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.20 లక్షలే ప్రకటించింది. దీంతో భూసేకరణ ప్రక్రియ ముందుకు సాగడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం, 1,950 హెక్టార్ల భూసేకరణకు మొత్తం రూ.5,100 కోట్లమేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా, బహిరంగ మార్కెట్ ధర దీనికి మరో మూడు రెట్లు అధికంగా ఉన్నదని అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ మార్కెట్ ధర చెల్లించే అవకాశం లేదని, ఒకవేళ భూసేకరణ చట్టం ప్రకారం బలవంతంగా భూములను సేకరిస్తే ప్రజల నుంచి, రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే ఆస్కారం ఉన్నదని పేర్కొంటున్నారు.
ఓ వైపు ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగం సమస్యల సుడిగుండంలో విలవిల్లాడుతుంటే, రాష్ట్ర సర్కారు దక్షిణ భాగాన్ని కూడా తెరపైకి తెచ్చింది. ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌కు ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఏర్పాటుచేసే విధంగా దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను రూపొందించారు. ఈ ప్రాంతంలో భూములను కోల్పోయే రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రహదారుల నిర్మాణం పేరుతో ప్రభుత్వం తమ బతుకులను ఆగం చేస్తున్నదని వారు విమర్శిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర సర్కారు మాత్రం ట్రిపుల్ ఆర్కు అనుమతులు ఇవ్వాలని పదేపదే కేంద్రాన్ని కోరుతున్నది. భూసేకరణ, రైతుల నష్టపరిహారం తేలకుండా అనుమతులు తెచ్చుకొని ఏం చేస్తారని పలువురు విమర్శిస్తున్నారు. వాస్తవానికి ట్రిపుల్ ఆర్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్మించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తమ సొంత ప్రయోజనాల కోసం దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను సిద్ధంచేసిందనే విమర్శలు ఉన్నాయి. దక్షిణ భాగాన్ని తామే నిర్మిస్తామని మొదట్లో ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, తమకు అనుకూలంగా అలైన్‌మెంట్‌ను రూపొందించుకొని ఇప్పుడు కేంద్రాన్ని నిర్మించాలని కోరుతుండటం గమనార్హం. అయితే రాష్ట్ర సర్కారు రూపొందించిన ఈ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌ను కేంద్రం ఏ మేరకు ఆమోదిస్తుందో కాలమే నిర్ణయించాలి.