ఆస్తిపన్ను మాఫీ, విద్యుత్తు కనెక్షన్ల క్యాటగిరీ మార్చాలన్న ట్రస్మా
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు నడవక, ఫీజులు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న బడ్జెట్ ప్రైవేట్ స్కూళ్లను ఆదుకోవాలని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్ మేనేజ్మెంట్ అసొసియేషన్ (ట్రస్మా) ప్రభుత్వాన్ని కోరింది. ఆస్తిపన్నును మాఫీ చేయడంతోపాటు విద్యుత్ కనెక్షన్ క్యాటగిరీని మార్చాలని విజ్ఞప్తిచేసింది. ట్రస్మా రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని శుక్రవారం లక్డికాపూల్‌లోని ఓ హోటల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాళ పాపిరెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమయ్యే వరకు ప్రైవేట్ టీచర్లకు రూ.2 వేలు, 25 కిలోల బియ్యం ఇవ్వాలని, టీచర్లకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని, కరోనా కాలానికి బస్సుల ట్యాక్స్, నీటి పన్నును పూర్తిగా తగ్గించాలని కోరారు. సమావేశంలో ట్రస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎన్ రెడ్డి, కోశాధికారి కే శ్రీకాంత్‌రెడ్డి, అధికార ప్రతినిధి చింతల రామచందర్, ఆర్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.