హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖ బడ్జెట్ పెరిగిందని, వసతులూ పెరిగాయని, దానికి అనుగుణంగా వైద్య సిబ్బంది పనితీరు కూడా మెరుగుపడాల్సిందేనని ఆ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదేశించారు. అందరం కలిసికట్టుగా పనిచేసి వైద్యారోగ్యశాఖను దేశానికే ఆదర్శంగా నిలుపుదామని పిలుపునిచ్చారు. ముఖ్యంగా నిలోఫర్, గాంధీ దవాఖానలపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగేలా సేవలందించాలని సూచించారు. నిలోఫర్, గాంధీ దవాఖానల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాల అధిపతులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విభాగాలవారీగా పనితీరును సమీక్షించారు.
ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలి
ఆరోగ్యశ్రీ సేవలు మరింత పెరగాలని మంత్రి హరీశ్‌రావు వైద్యాధికారులకు సూచించారు. గాంధీలో మోకాలు, తుంటి ఎముకల మార్పిడి సర్జరీలతోపాటు ఇతర అవయవ మార్పిడి సర్జరీలు కూడా పెరుగాలని ఆదేశించారు. సీ-సెక్షన్లు తగ్గించి, సాధారణ కాన్పులను ప్రోత్సహించాలని సూచించారు. కరోనా, బ్లాక్ ఫంగస్ విషయంలో గాంధీ వైద్యులు, సిబ్బంది బాగా పనిచేశారని అభినందించారు.
సలహాల పెట్టెలు ఏర్పాటు చేయండి
నిలోఫర్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు తీసుకునేందుకు ప్రత్యేకంగా పెట్టెలు ఏర్పాటుచేయాలని మంత్రి ఆదేశించారు. బాగా పని చేసే వైద్యులను ఈ నెల 7న వరల్డ్ హెల్త్ డే సందర్భంగా నగదు పురసారంతో సన్మానించనున్నట్టు తెలిపారు. నిలోఫర్‌లో కడుతున్న 800 పడకల బ్లాక్ పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, కుటుంబ, సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, సీఎం ఓఎస్డీ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.