చండూరు : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న బీ(టీ)ఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఓటర్లను కోరారు. ఉప ఎన్నికలో భాగంగా తనకు ఇన్చార్జీగా అప్పగించిన మునుగోడు నియోజకవర్గం చండూరు 2, 3వ వార్డులలో ఇవాళ ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్ అందజేస్తున్న పథకాల గురించి ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు.
ఆసరా పింఛన్లు అందుతున్నాయా అని వృద్ధులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటికి పెద్దన్న మాదిరిగా అండగా నిలుస్తున్న కేసీఆర్కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, మునుగోడు ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటు వేసి అధికార పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాలకుర్తి నియోజకవర్గం నుంచి ప్రచారం కోసం వచ్చిన నాయకులు ఉన్నారు.