హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీలో బీఎస్సీ (హానర్స్)లో డిజైన్ అండ్ టెక్నాలజీ కోర్సును ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెడుతున్నట్టు సొసైటీ కార్యదర్శి రొనాల్డ్‌రోస్ తెలిపారు. 40 సీట్లు ఉండే ఈ కోర్సులో అమ్మాయిలకు మాత్రమే అడ్మిషన్లు ఇస్తామని చెప్పారు.
టీఎస్డబ్ల్యూడీటాట్-2022 ప్రవేశపరీక్ష ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. జనరల్ ఎబిలిటీ నుంచి 30 మార్కులు, డిజైన్ ఎబిలిటీ నుంచి 70 మార్కులకు ప్రశ్నలు ఉంటాయని వివరించారు. ఇంటర్మీడియట్ లేదా కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసినవారు అర్హులని తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు www.tswreis.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.