హైదరాబాద్, మే 11(నమస్తే తెలంగాణ): ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (అగ్రికల్చర్), కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులకు అదనంగా 2025- 26 నుంచి ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం (డబ్ల్యూఎస్యూ)తో కలిసి నాలుగేండ్ల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సు ప్రారంభించనున్నదని వీసీ ప్రొఫెసర్ డాక్టర్ ఆల్దాస్ జానయ్య తెలిపారు. విద్యార్థులు నాలుగేండ్ల కోర్సు వ్యవధిలో మూడేండ్ల పీజేటీఏయూలోనూ, ఒక ఏడాది వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలోనూ విద్య అభ్యసిస్తారని పేర్కొన్నారు.
తద్వారా రెండు విశ్వవిద్యాలయాల్లోనూ విద్యనభ్యసించే అవకాశం విద్యార్థులకు కలుగుతుందని ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరైనా పీజీ తర్వాత వెస్టర్న్ సిడ్నీ వర్సిటీలో పీహెచ్డీ చేయదలచుకుంటే ఎలాంటి రుసుము లేకుండా సాలర్షిప్ సాయంతో పూర్తి చేయవచ్చునని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై రెండు విశ్వవిద్యాలయాల మధ్య ఒప్పందం కుదిరే ప్రక్రియ తుది దశలో ఉన్నదని జానయ్య వెల్లడించారు.
ఈ వెస్టర్న్ సిడ్నీ విశ్వవిద్యాలయం అందించే అన్ని వ్యవసాయ కోర్సులకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్) గుర్తింపు ఉన్నదని వివరించారు. ఈ మేరకు ఐకార్, డబ్ల్యూఎస్యూల మధ్య నిరుడు ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక కోర్సుల ప్రవేశాల కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఆదివారం విడుదల చేసిన ఈపీ సెట్-2025 ఫలితాల్లో ర్యాంకులు సాధించిన వారికి జానయ్య అభినందనలు తెలిపారు.