BRSV | హైదరాబాద్ : ఇంజినీరింగ్ ఫీజులు పెంచొద్దు.. బీ కేటగిరీ సీట్లను కౌన్సెలింగ్ ద్వారానే భర్తీ చేయాలని, డొనేషన్లు తీసుకునే కాలేజీల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో మాసబ్ ట్యాంక్ ఉన్నత విద్యామండలి వద్ద బీఆర్ఎస్వీ నిరసన కార్యక్రమం చేపట్టింది. అనంతరం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణ రెడ్డిని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు కలిసి వినతి పత్రం సమర్పించారు.
అనంతరం గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. బీ కేటగిరీ సీట్లను ఆన్లైన్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీలు ఇప్పటికే 20 నుండి 25 లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఇంజినీరింగ్ కాలేజీలతో కుమ్మక్కైంది. యాజమాన్యాలు ఇచ్చిన లంచాలతో ప్రభుత్వం మౌనంగా ఉంది. గత ఏడాది ఉన్న ఫీజులు అలాగే కొనసాగించాలి.. ఒక్క రూపాయి కూడా పెంచొద్దని డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యాలు ఇచ్చే డబ్బులకు లొంగి ప్రభుత్వం ఫీజులు పెంచితే చూస్తూ ఊరుకోం. బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
తప్పుడు అఫిడవిట్లు సమర్పించిన ప్రైవేటు కాలేజీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మెడికల్ కౌన్సిల్ ద్వారా సీట్లను భర్తీ చేసినట్లు ఇంజినీరింగ్ సీట్లను అదేవిధంగా భర్తీ చేయాలి. బీ కేటగిరీ సీట్లు ఆన్లైన్ ద్వారానే భర్తీ చేయాలి. లేని పక్షంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యం లో పోరాటం ఉధృతం చేస్తాం. స్కూల్ ఎడ్యుకేషన్ మొదలు హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు అధిక ఫీజులు పెంచి పేదలకు భారం పడేలా చేస్తున్నారు. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయ్యాక ఒక మాట మాట్లాడి మాట తప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రైవేటు యాజమాన్యాలకు వత్తాసు పలికి అధిక ఫీజులు పెంచితే చూస్తూ ఊరుకోం.. ప్రభుత్వం దిగి రాకపోతే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల తరపున పోరాటం చేస్తామని గెల్లు శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.