హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): విద్యార్థులు తమ హకులు, సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు సొంత సంఘం జెండాను పట్టుకోవడం సహజమని, గులాబీ జెండా కనిపించగానే రాజకీయ రంగు పులమడం ‘ఆంధ్రజ్యోతి’ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు నాగేందర్ కోదాటి శనివారం ప్రకటనలో మండిపడ్డారు. పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో గులాబీ జెండాలు పట్టుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక ప్రచురించిన కథనాన్ని తీవ్రంగా ఖండించారు.
ఎన్ఎస్యూఐ, టీఎన్ఎస్ఎఫ్ వంటి ఇతర విద్యార్థి సంఘాల జెండాలతో ఆందోళనలు చేసినప్పుడు లేని అభ్యంతరం బీఆర్ఎస్వీ జెండాను చూస్తేనే ఎందుకు వస్తున్నదని, అసలు గులాబీ జెండా అంటే ‘ఆంధ్రజ్యోతి’ పత్రికకు ఎందుకంత భయమని ప్రశ్నించారు. విద్యార్థులు ఏ సంఘంతో కలిసి తమ సమస్యలపై పోరాడాలో నిర్ణయించుకొనే పూర్తి హకు వారికి ఉన్నదని, మీడియా బాధ్యతగా వాస్తవాలు తెలియజేయాలే తప్ప.. ఒక నిర్దిష్ట విద్యార్థి సంఘాన్ని లక్ష్యంగా చేసుకొని కథనాలకు రాజకీయ రంగు పులమకూడదని నాగేందర్ స్పష్టంచేశారు. ‘ఆంధ్రజ్యోతి’కి నిజంగా నిష్పక్షపాత వైఖరి ఉంటే అన్ని విద్యార్థి సంఘాల నిరసనలకు ఒకే ప్రమాణాన్ని పాటించాలని సూచించారు.