కల్వకుర్తి, అక్టోబర్ 1: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ సమీపంలోని సూర్యలత కాటన్ మిల్ గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం జరిగిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో హస్తం పార్టీ కార్మిక యూనియన్ ఐఎన్టీయూసీ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఐఎన్టీయూసీ అభ్యర్థి ఆనంద్‌కుమార్‌పై బీఆర్ఎస్కేవీ అభ్యర్థి సూర్యప్రకాశ్‌రావు 68 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.
మిల్లులో మొత్తం 450 మంది కార్మికులకు ఓటు హక్కు ఉండగా.. అందులో 438 మంది ఓటేశారు. ఉదయం 7 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ సాగింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోలైన ఓట్లను లెక్కించారు. 438 ఓట్లలో బీఆర్ఎస్కేవీ అభ్యర్థి సూర్యప్రకాశ్‌రావుకు 251 ఓట్లు, ఐఎన్టీయూసీ అభ్యర్థి ఆనంద్‌కుమార్‌కు 183 ఓట్లు వచ్చాయి. నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు. 68 ఓట్ల తేడాతో బీఆర్ఎస్కేవీ అభ్యర్థి సూర్యప్రకాశ్‌రావు సూర్యలత స్పిన్నింగ్ మిల్లు గుర్తింపు కార్మిక అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు కార్మిక శాఖ అధికారులు ప్రకటించారు.
మిన్నంటిన బీఆర్ఎస్ సంబురాలు
బీఆర్ఎస్కేవీ అభ్యర్థి సూర్యప్రకాశ్‌రావు గెలుపొందినట్టు కార్మిక శాఖ అధికారులు ప్రకటించిన వెంటనే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంబురాలు మిన్నంటాయి. కార్మికులు, గులాబీ శ్రేణులు నినాదాలు చేస్తూ, ర్యాలీ నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ పెద్ద ఎత్తున పటాకులు కాల్చారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడిగా గెలుపొందిన సూర్యప్రకాశ్‌రావును మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంతోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు అభినందించారు.
ప్రతి ఎన్నికల్లో ఇవే ఫలితాలు : మాజీ ఎమ్మెల్యే జైపాల్
విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కార్మికులను, బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇక నుంచి ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి ఫలితాలే వస్తాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను వంచనకు గురిచేసిందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఇలాకాలో కాంగ్రెస్ పార్టీకి కార్మికులు కర్రుకాల్చి వాతపెట్టారని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజల ఉసురుపోసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైందని చెప్పడానికి ఈ ఎన్నికలే నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్మికులకు ఎన్నో హామీలు ఇచ్చారని, అయినా వారు నమ్మలేదని వివరించారు. రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్దే విజయమని జైపాల్ పేర్కొన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను పాతాళంలోకి తొక్కాలని జైపాల్ పిలుపునిచ్చారు.