మహబూబాబాద్ : కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి గులామ్ గిరీ చేసెటోళ్లని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహబూబాబాద్‌లో జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ నేతల తీరును దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు ఇవాళ మహబూబాబాద్‌లో తమ పార్టీకి చెందిన దివంగత నేత నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి గులామ్ గిరీ చేసెటోళ్లు విగ్రహాన్ని ఆవిష్కరిస్తే ఆయన ఆత్మ క్షోభిస్తదని అన్నారు.
‘ఇయ్యాల నేను మహబూబాబాద్‌కు వస్తుంటే మాలోతు కవితమ్మ ఫోన్ చేసి.. ‘అన్నా ఇక్కడ కాంగ్రెసోళ్ల ప్రోగ్రామ్ జరుగుతున్నది, మీరు నెల్లికుదురు మీదుగ రండి’ అని చెప్పింది. ఏ ప్రోగ్రామ్ అంటే కలెక్టరేట్ ముందు నూకల రామచంద్రారెడ్డిగారి విగ్రహావిష్కరణ జరుగుతున్నది అన్నది. నూకల రామచంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన గొప్ప నాయకుడు. ఆయన 1970లలోనే ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత కలిగిన నేత. కానీ ఆయనది అధికారం కోసం లాలూచీపడే గుణం కాదు కాబట్టి, ఢిల్లీ పెద్దలకు గులామ్ గిరీ చేసే లక్షణం లేదు కాబట్టి సీఎం కాలేకపోయారు. ఆ మహానేతను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయినా.. బీఆర్ఎస్ హయాంలో మహబూబాబాద్ కలెక్టరేట్‌ను ప్రారంభించేందుకు వచ్చిన సమయంలో కేసీఆర్.. కలెక్టరేట్ ముందు నూకల రామచంద్రారెడ్డి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయించారు’ అని కేటీఆర్ చెప్పారు.
‘అప్పటిదాకా నూకల రామచంద్రారెడ్డి గారిని మరిచిపోయిన కాంగ్రెస్ నేతలు.. ఆయన విగ్రహం పెట్టాలని కేసీఆర్ నిర్ణయించిన తర్వాత సోయికి వచ్చిండ్రు. ఢిల్లీకి గులామ్ గిరీ చేసెటోళ్లు, ఢిల్లీకి మూటలు మోసేటోళ్లు. ఢిల్లీకి చెప్పులు మోసెటోళ్లు ఇయ్యాల ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నరట. ఇలాంటోళ్లు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తే రామచంద్రారెడ్డి గారి ఆత్మ క్షోభిస్తది’ అని వ్యాఖ్యానించారు.