KTR | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మంత్రివర్గంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎంతో పాటు మంత్రులు హెలికాప్టర్‌ను షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
17 నెలల కాలంలో 43 సార్లు ఢిల్లీకి వెళ్లిండు రేవంత్ రెడ్డి.. ఉట్టిగనే గడ్డపారలాగా పోడు కదా..? ఆయన వెంట సిబ్బంది, చాలా మంది నేతలు, బ్రోకర్లు వెళ్తారు కదా..? ఎక్కే విమానం.. దిగే విమానం.. తెచ్చిందైతే ఏం లేదు.. విమానానికి పెట్టిన ఖర్చు ఎంతనో శ్వేతపత్రం విడుదల చేయ్.. 17 నెలల్లో మీ మంత్రులు నల్లగొండకు అంటే 100 కిలోమీటర్లు పోయేందుకు కూడా హెలికాప్టర్‌ను షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నరు. ఆ హెలికాప్టర్ కోసం కొట్టుకుంటున్నరు. ఎమ్మెల్యేల బర్త్‌డేలకు హెలికాప్టర్లలో పోతున్నారు అని కేటీఆర్ ఎద్దెవా చేశారు.
ప్రభుత్వ ఉద్యోగుల మీద నిన్న రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కాడు. ఉద్యోగుల వల్ల దివాళా తీసిందని ప్రచారం చేస్తున్నవ్. అవమాన పరుస్తున్నవ్. అడ్డమైన మాటలు మాట్లాడుతున్నవ్. ఉద్యోగులను చులకన చేయడం దారుణం. దుర్మార్గపు సీఎం ఆలోచన విధానాన్ని ఉద్యోగస్తులు అర్థం చేసుకోవాలి. ఆశాలు, అంగన్వాడీల జీతాలు పెంచుతామని నువ్వు చెప్పలేదా..? హైదరాబాద్‌లో ధర్నా చేసేందుకు వస్తే వారి చీరలు చింపి కొడుతారు.. సచివాలయం వద్ద దుశ్శాసన పర్వాన్నిఆవిష్కరించింది నువ్వు కదా..? ఇంతకన్న చిల్లర ముఖ్యమంత్రి ఎవడున్న ఉంటాడా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఉద్యోగులు జీతాలు అడగొద్దు.. ఆర్టీసీ కార్మికులు అపాయింట్ డే అడగొద్దు.. ప్రజలు మీరిచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అడొగద్దు. ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో. హోదాకు తగ్గట్టు ప్రవర్తించే సంస్కారం, వ్యక్తిత్వం ఉండాలి. కేసీఆర్ చావును నిరంతరం కోరుకునే నువ్వు సీఎంవా..? ఇంతకంటే హీనమైనా మనిషి ఉంటాడా..? నీకు సంస్కారం ఉందా..? నీ కోసం నీ పార్టీ కోసం ఉద్యోగస్తులను మోసం చేయకు అని కేటీఆర్ సూచించారు.