KTR | రాష్ట్రంలో ఈ ఏడాది ఉప ఎన్నికలు రావొచ్చని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ఆయన బీఆర్ఎస్ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకుంటారని తాము భావిస్తున్నామన్నారు. స్పీకర్ తేల్చకపోతే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఈ ఏడాది ఉప ఎన్నికలు రావొచ్చన్నారు.
ఫార్ములా-ఈ రేస్‌లో ఒక్క పైసా అవినీతి జరుగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పని.. ఈ కేసులో ఏమాత్రం పసలేదన్నారు. అవినీతి లేనప్పుడు కేసు ఎక్కడిదంటూ కేటీఆర్ ప్రశ్నంచారు. ఏసీబీ పెట్టిన కేసులో అవినీతి లేని మొదటి కేసు ఇదేనన్నారు. కోర్టులో కేసు విషయంలో వాదనలు జరిగిన సమయంలో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఏజీ దగ్గర సమాధానమే లేదన్నారు. ఫార్ములా ఈ రేసు కేసు ఓ లొట్టపీసు కేసు అంటూ సెటైర్లు వేశారు. తనను ఎలాగోలా జైలుకు పంపాలని రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని.. అందులో భాగమే ఫార్ములా-ఈ రేస్ కేసుతో ఆరో విఫలప్రయత్నం చేశారని విమర్శించారు. కేసుతనను ఎలాగోలా జైలుకు పంపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగా ఫార్ములా ఈ రేసు కేసుతో ఆరో విఫల యత్నం చేశారని కేటీఆర్ ఆరోపించారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో తనను అరెస్ట్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డిని కూడా అరెస్టు చేయాల్సిందేనన్నారు. ఫార్ములా-ఈ రేసుకు అప్పుడు మంత్రిగా తాను అనుమతిస్తే.. ఇప్పుడు రద్దు చేశారన్నారు. తాను తప్పు చేస్తే రేవంత్‌రెడ్డిది ఒప్పు ఎలా అవుతుందని సూటిగా ప్రశ్నించారు. ఈ నెల 7న ఈడీ విచారణకు హాజరయ్యే విషయంపై న్యాయనిపుణులు నిర్ణయిస్తారన్నారని పేర్కొన్నారు తెలిపారు. తనకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ కాంట్రాక్టుల్లో రూ.12వేల కోట్ల అవినీతి జరుగుబోతోందని.. బడా కాంట్రాక్టర్ల నుంచి కాంగ్రెస్ నాయకులు రూ.వేల కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ప్రజల్లోకి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారని స్పష్టం చేశారు. కేసీఆర్ తమ ట్రంప్ కార్డ్ అని.. ఆయన ఎప్పుడు రావాలో.. ఆయనకు తెలుసునన్నారు. ఫిబ్రవరి, మార్చిలో పార్టీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. వేసవికాలం నుంచి పార్టీ సభ్యత్వ నమోదు ఉంటుందన్నారు. అక్టోబర్‌లో బీఆర్ఎస్ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని.. కేసీఆర్‌ను తాను పార్టీ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తానన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు చేసిన వ్యాఖ్యలపై సైతం కేటీఆర్ స్పందించారు. దిల్ రాజుకు రెండు సినిమాలు ఉన్నాయని.. వాటి గురించే ఆయన బాధ అని వ్యాఖ్యానించారు.