హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ప్రజలపై క్రూరంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘మీ కుటుంబంపై ఇలాగే జరిగితే మీరు ఊరుకుంటారా రాహుల్‌గాంధీ జీ?’ అని నిలదీశారు. అమానవీయంగా వ్యవహరించే ప్రభుత్వమే ఇలాంటి చర్యలకు దిగుతుందని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణలో ఇద్దరు మహిళలు తమ ఇంట్లోనే ఉన్నప్పుడు ఇంటి ముందు భాగాన్ని బుల్డోజర్తో క్రూరంగా కూల్చివేయడం కలిచివేస్తున్నదని, వారికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ గురుకుల బాట చేపట్టడంతో కాంగ్రెస్ సరారులో ఎట్టకేలకు కదలిక వచ్చిందని, దొంగలు పడ్డ ఆరు నెలలకు అన్నట్టు.. ఇప్పుడు తీరిగ్గా గురుకులాల బాటపట్టారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సంక్షేమ పాఠశాలలను సంక్షోభ పాఠశాలలుగా మార్చి, సామాన్య విద్యార్థుల్లో భయాందోళనలు, తల్లిదండ్రుల్లో ఆవేదనకు తెరలేపారని మండిపడ్డారు. ‘గురుకులాల మొకుబడి సందర్శన కాదు.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టండి. ఫొటోలకు పోజులు ఇవ్వడం కాదు.. పట్టెడు నాణ్యమైన బువ్వపెట్టి కడుపులు నింపండి.
కెమెరాల ముందు హంగామా చేసుడు కాదు.. గురుకుల బిడ్డల గుండెచప్పుడు వినండి. మందీ మార్బలంతో దండయాత్ర కాదు.. గురుకుల సమస్యలను తీర్చే ప్రయత్నం చేయండి’ అని హితవుపలికారు. పాఠాలు చెప్పే చోట పాము కాట్లతో పసిబిడ్డల ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులు శిఖరాలను అధిరోహిస్తే.. ఏడాది కాంగ్రెస్ పాలనలో దవాఖాన బెడ్లను ఎకించారని విమర్శించారు. ‘ఎట్లుండె తెలంగాణ.. ఎట్లాయె తెలంగాణ’ అని వాపోయారు.