రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 25 ( నమస్తే తెలంగాణ ) : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కపేట రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి.. పంటలకు సాగునీరందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంగళవారం లేఖ రాశారు. మధ్యమానేరు నీటిని ఎత్తిపోసి మల్కపేట రిజర్వాయర్ ద్వారా ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగసముద్రం చెరువును నింపాలని లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే మల్కపేట రిజర్వాయర్ ఎత్తిపోతల ట్రయల్ రన్ పూర్తయ్యిందని, ఎన్నికల కోడ్ రావడంతో ప్రారంభోత్సవం చేయలేకపోయామని వివరించా రు. మధ్యమానేరులో 17 టీఎంసీల నీరు ఉన్నందున నీటిని ఎత్తిపోసి సింగసము ద్రం చెరువును నింపి రెండువేల ఎకరాలకు సాగునీరందించాలని కోరారు. దీంతో రాచర్లబొప్పాపూర్, గొల్లపల్లి, దేవునిగుట్టతండా, రాచర్ల తిమ్మాపూర్, బాకూర్‌పల్లి తండా, అల్మాస్పూర్, అక్కపల్లి, బుగ్గరాజేశ్వర్తండా, నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, కోరుట్లపేట, సముద్రలింగాపూర్ గ్రామాలకు చెందిన రైతుల పంటలను కాపాడుకున్న వాళ్లమవుతామని విజ్ఞప్తి చేశారు.