KTR | హైదరాబాద్ : వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. స్వర్ణ కిలారి రాసిన మేక బతుకు పుస్తకాన్ని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణలో పాల్గొన్న కేటీఆర్ ప్రసంగించారు.

నేను స్వయంగా దుబాయ్ వెళ్ళాను.. అక్కడ ఉన్న లేబర్ క్యాంపులో కార్మికుల కష్టాలను చూశాను. గల్ఫ్ కార్మికుల కష్టాలు విన్నా.. చూసినా గుండె తరుక్కుపోతుందన్నారు. అక్కడ వారు నివసిస్తున్న పరిస్థితులను చూస్తే బాధ అవుతుంది. గతంలో గల్ఫ్ కార్మికుల కోసం పాలసీ తేవాలని ప్రయత్నం చేశాం. టామ్‌కామ్ సంస్థ ద్వారా కొంత ప్రయత్నం చేశాము. కానీ మరింత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉన్నది. వలస ఎంత వాస్తవమో.. వలసలోన దోపిడీ కూడా అంతే వాస్తవం.. అది దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా ఇంకెక్కడైనా. పెద్దూరు వలస కార్మికుల కోసం దుబాయ్‌లోని జైలుకు వెళ్లి కలిసి వచ్చాను. వారిని విడిపించేందుకు అనేక ప్రయత్నాలు చేసి.. సంవత్సరాల తర్వాత చివరికి ఇండియాకి తీసుకు రాగలిగామని కేటీఆర్ పేర్కొన్నారు.
గతంలో సుష్మా స్వరాజ్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి గల్ఫ్‌కి జరుగుతున్న ఆడవాళ్ళ అక్రమ రవాణాపైన చర్చించారు.. ఆ దిశగా దాని అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ఒకనాడు దేశంలో ఎక్కడ నిర్మాణం జరిగిన పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవి. ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ దాకా అనేక రంగాల్లో రాష్ట్రాలు నుంచి తెలంగాణకు వలస వస్తున్నారు. ప్రస్తుతం సమాజంలో చదివే అలవాటు బాగా తగ్గుతూ వస్తుంది. ఇలాంటి సమయంలోను అన్విక్షకి సంస్థ ఈ పుస్తకాన్ని తీసుకురావడం హర్షనీయం. సమాజంలో చైతన్యం, మార్పు తీసుకురాగలిగే సాహిత్యానికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా పుస్తక ప్రచురణలతో పాటు డిజిటల్ మాధ్యమల ద్వారా ఆడియో పుస్తకాల ద్వారా ఈ దిశగా మరింత ప్రయత్నం జరగాలని కేటీఆర్ సూచించారు.