హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి ఎవరితోనైనా ఫుట్‌బాల్ ఆడుకోవచ్చు.. కానీ రెండేండ్లలో అన్ని వర్గాలను మోసం చేసిన ఆయనను ప్రజలే ఫుట్‌బాల్ ఆడుడు ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు. పాలనా వైఫల్యాలతోనే దిగ్గజ కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఆరోపించారు. రెండేండ్లలో పథకాల పేర్లు మార్చడం తప్ప సాధించిందేమీ లేదని దెప్పిపొడిచారు.
రేవంత్‌రెడ్డి తరహాలో కుటుంబసభ్యులను రాజకీయాల్లోకి లాగడం తమ సంస్కృతి కాదని, అది కేసీఆర్ పద్ధతి కాదని కుండబద్దలు కొట్టారు. బీసీలకు 42శాతం కోటా పేరిట డ్రామాలు చేసిన కాంగ్రెస్ చివరకు పంచాయతీ ఎన్నికల్లో 17శాతమే ఇచ్చి చేతులెత్తేసిందని నిప్పులు చెరిగారు. పంచాయతీ ఎన్నికల్లో 66 శాతం స్థానాలు గెలిచామని విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డి దమ్ముంటే ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీ నామా చేయించాలని సవాల్ విసిరారు.
తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సందర్భంలో బీఆర్ఎస్ అనేక విజయాలు సాధించిందని, కానీ రేవంత్‌రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ అనేకసార్లు ఓటమిని మూటగట్టుకున్నదని గుర్తుచేశారు. బీజేపీ ఢిల్లీ పెద్దలతో లోపాయికారి ఒప్పందాన్ని కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి బీఆర్ఎస్పై బురుదజల్లడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. తెలంగాణ ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. నగరాన్ని మూడు ముక్కలు చేయాలనే రేవంత్ ఆలోచన అశాస్త్రీయమని తేల్చిచెప్పారు. శనివారం తెలంగాణ భవన్లో సుదీర్ఘంగా నిర్వహించిన మీడియాతో చిట్‌చాట్‌లో అనేక ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇకపై కేసీఆర్ నేరుగా ప్రజల్లోకి వస్తారు. ఇవాళ జరిగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రస్థాయి సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత నిర్మాణంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. ప్రజాసమస్యలపై పోరాటానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికలు ముగిసిన వెంటనే సభ్యత్వ నమోదుచేపడుతాం.
– కేటీఆర్
రాజకీయాల్లో సంస్కారం ముఖ్యం
రాజకీయాల్లో సంస్కారం, విలువలు ముఖ్యమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంట్లోని మహిళలు, పిల్లలు, ఆయన మనుమడి గురించి మాట్లాడనని, వారి కుటుంబసభ్యుల విషయంలో చిల్లర రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. రాజకీయ పోరాటం కేవలం నేతల మధ్యే ఉండాలని, గతంలో అస్సాం సీఎం రాహుల్ పుట్టుకను ప్రశ్నించిన సందర్భంలో కేసీఆర్ నిర్ద్వంద్వంగా ఖండించారని గుర్తుచేశారు. విలువలతో కూడిన రాజకీయమే తమ సంస్కృతి అని ఉద్ఘాటించారు.
రేవంత్‌రెడ్డి మొన్న మీడియాతో మాట్లాడిన సమయంలో మనుమడితో ఫుట్‌బాల్ ఆడిన అంశంపై స్పందించాలని కోరగా, తాను ఆయన మనువడి గురించి మాట్లాడనని, కేసీఆర్ అలాంటి పద్ధతి నేర్పించలేదని తేల్చిచెప్పారు. రేవంత్ తరహాలో కుటుంబీకులను రాజకీయాల్లోకి లాగడం, ప్రత్యర్థుల చావును కోరుకొనే నీచమైన మనస్తత్వం తనదికాదన్నారు. రేవంత్, ఆయన మనువడు, కుటుంబీకులు నిండూ నూరేండ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తానని పేర్కొన్నారు. కానీ రాజకీయంగా రేవంత్‌రెడ్డిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
బీసీ కోటాపై కాంగ్రెస్ ద్రోహం
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ దారుణంగా వంచించిందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. గతంలో 23శాతం ఉన్న రిజర్వేషన్లను 17శాతానికి తగ్గించిందని మండిపడ్డారు. పార్టీపరమైన రిజర్వేషన్లకు సీఎంకు సంబంధం లేదని, ఆయన కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు అధ్యక్షుడు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బీసీలకు సీట్లు ఇచ్చే అంశంపై తాము రేవంత్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని, అనేక సందర్భాల్లో మెరుగైన ప్రాతినిధ్యం కల్పించామని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్ కోటాలో 6 సీట్లు(50శాతం) ఇచ్చామని, కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో 34శాతం సీట్లు బీఆర్ఎస్ ఇస్తే, కాంగ్రెస్ 19 సీట్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నదని ఆయన ధ్వజమెత్తారు.
బీసీలకు 42శాతం కోటాపై ఆయనకు చిత్తశుద్ధి లేదని ఆక్షేపించారు. నిజంగానే బలహీనవర్గాలపై ప్రేమ ఉంటే ఆయన చేయదగిన విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టుల్లో కోటా ఎందుకివ్వడం లేదని కేటీఆర్ నిలదీశారు. ముదిరాజ్‌లను బీసీ-‘ఏ’లో చేర్చుతామని, ఏటా రూ.20వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీలు గుప్పించి నట్టేట ముంచారని ఆయన మండిపడ్డారు. వైన్స్‌ల కేటాయింపులో గౌడన్నలకు, మార్కెట్ కమిటీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని గుర్తుచేశారు. 42శాతం కోటాను తెరపైకి తెచ్చి బీసీలను మోసం చేసిన రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకేటే అంటూ రేవంత్ చేసిన కామెంట్స్‌పై కేటీఆర్ రియాక్టయ్యారు. ‘రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ మధ్య అద్భుతమైన మైత్రి బంధం ఉన్నది.. అదీ ముఖ్యమంత్రికి, బీజేపీ నేతలకు తెలుసు.. అందుకే ప్రధాని మోదీ రాష్ట్ర బీజేపీ నేతలకు తలంటినట్లు వచ్చిన వార్తలను ప్రస్తావించారు.
రేవంత్ ఇంటిని రీమోడల్ చేయించింది బీజేపీ ఎంపీ కాదా?
కాంగ్రెస్, బీజేపీలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని ప్రజలను ఏమార్చుతున్నాయని కేటీఆర్ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ బీజేపీ పెద్దలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ‘చీకట్లో చేతులు కలుపకుంటే ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహ ప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లారో రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఢిల్లీ తుగ్గక్ రోడ్డులోని రేవంత్ ఇంటిని రీ మోడలింగ్ చేయించింది ఓ బీజేపీ ఎంపీయేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌కు రేవంత్‌రెడ్డి కాంట్రాక్టులు ఇస్తున్నందుకే ఆ పార్టీ పెద్దలు రాష్ట్ర కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని, కేంద్ర హోం మంత్రి ఆరోపణలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ మరీ కేంద్రంలోని బీజేపీ చర్యలెందుకు తీసుకోలేదని నిలదీశారు. పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగిన తర్వాత కేసు నమోదు చేయకుండా ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు ఢిల్లీ కాంగ్రెస్‌కు ఏటీఎంగా మారిందన్నారు. అఖిలేశ్ యాదవ్ తనకు మొదటినుంచీ మంచి మిత్రుడని, ఆయనను కలిస్తే బీజేపీ నేతలకు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి రూపాయి కూడా తేవడం చేతగాని కిషన్‌రెడ్డితో తమకేం ప్రయోజనం ఉంటుందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.
పాలనా వైఫల్యం.. పారిశ్రామికాభివృద్ధికి విఘాతం
రేవంత్ సర్కారు పాలనా వైఫల్యంతో పారిశ్రామికాభివృద్ధికి విఘాతం కలుగుతున్నదని, రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తున్నదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పారిశ్రామిక వేత్తలు ఏపీకి తరలిపోతున్నారు.. విరూపాక్ష ఫార్మా లాంటి కంపెనీలు కర్నూలుకు వెళ్లిపోవడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. లగచర్లలో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గ్రీన్ ట్రిబ్యునల్ మొట్టికాయలు వేసినా కాంగ్రెస్ నేతలకు బుద్ధిరాలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫార్మాసిటీ రద్దు, ఫార్మా విలేజీల ఏర్పాటు, అడ్దదిడ్డమైన విధానాలతో ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు.
‘ఉపాధి’లో సంస్కరణలతో పేదలకు అన్యాయం
ఉపాధి హామీ పథకంలో సంస్కరణల పేరిట గ్రామీణ పేదలకు తీరని అన్యాయం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం మహాత్ముడి పేరు మార్చడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. అసలు ఆ ఆలోచన బీజేపీకి ఎందుకు వచ్చిందని ప్రశ్నించినా ఆయన, అడ్డగోలు నిబంధనలతో ఉపాధి పథకం ఉసురు తీసేందుకు కంకణం కట్టుకున్నదని ఆరోపించారు. ఈ స్కీమ్ పేరు మార్పుపై పార్లమెంట్ సాక్షిగా అభ్యంతరం వ్యక్తం చేసిన ప్రియాంక గాంధీ.. తమ పార్టీ పాలిత రాష్ట్రమైన తెలంగాణలో అడ్డగోలుగా పథకాల పేర్లు మార్చుతుంటే ఎందుకు మౌనం వహించారని నిలదీశారు. కాంగ్రెస్ సర్కారు పేర్లు మార్చడమే కాదు.. ఏకంగా తెలంగాణ తల్లినే మార్చిందంటూ నిప్పులు చెరిగారు.

Ktr
నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీని గెలుపుబాటలో నడిపించా. 90శాతం మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగరేశాం. జీహెచ్ఎంసీని రెండోసారి కైవసం చేసుకున్నం. రాష్ట్రంలోని అన్ని జడ్పీలను గెలుచుకున్నం. కానీ రేవంత్ మాత్రం సొంత పార్లమెంట్ సీటును కూడా గెలిపించుకోలేకపోయాడు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దారుణ ఓటమిని చవిచూసింది. రాజకీయాల్లో రాహుల్, రేవంత్ ఐరన్లెగ్లే.
– కేటీఆర్
ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బల్దియాల విలీనం
మున్సిపల్ ఎన్నికలు, హైదరాబాద్ అభివృద్ధి, జీహెచ్ఎంసీలో వార్డుల విభజన, మున్సిపాలిటీల విలీన ప్రక్రియ సక్రమంగా జరుగలేదని కేటీఆర్ ఆక్షేపించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా బల్దియాలను గ్రేటర్ హైదరాబాద్‌లో విలీనం చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. గ్రేటర్‌ను మూడు కార్పొరేషన్లు చేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. వార్డుల విభజన అశాస్త్రీయంగా చేశారని చెప్పారు. ఒక వార్డులో అత్యంత తక్కువ జనాభా, మరొక వార్డులో పెద్దమొత్తంలో ఓటర్లు ఉన్నారని చెప్పారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి.. జీహెచ్ఎంసీని విస్తరించి 300 వార్డులుగా చేసినప్పటికీ అసలు ఎన్ని కార్పొరేషన్లు చేస్తారు? వార్డుల పునర్వవ్యస్థీకరణపై ప్రభుత్వ ఆలోచన ఏమిటి? అనే విషయాలు ప్రజలకు, పార్టీలకు చెప్పకపోవడం అభ్యంతరకరమన్నారు. అసెంబ్లీలోనూ ఈ అంశంపై స్పష్టతనివ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. అయితే హైదరాబాద్‌ను మూడు ముక్కలుగా చేస్తానని తన మిత్రులతో రేవంత్ చెప్పుకొంటున్నట్టు వస్తున్న వార్తలను ప్రస్తావించారు.
అయితే విభజన అంశం ప్రజాప్రతినిధుల కంటే ముందే ఆయన మిత్రులకు తెలుస్తున్నదని, స్వయంగా హైదరాబాద్ మేయర్ కూడా తనకు సమాచారం లేదని కౌన్సిల్ మీటింగ్‌లో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. వార్డుల విభజనపై బీఆర్ఎస్ సభ్యులు కౌన్సిల్లో స్పష్టంగా తెలియజేశారని చెప్పారు. చిన్న మున్సిపాలిటీలను పెద్దవాటిలో కలిపితే అనేక సమస్యలు వస్తాయనే విషయాన్ని లేవనెత్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ రెండో రాజధాని అంశపై స్పందిస్తూ అనేక ఏండ్లు ఉద్యమించి హైదరాబాద్ రాజధానిగా తెలంగాణను సాధించుకున్న తర్వాత రెండో రాజధానిగా చేసే సాహసం బీజేపీ, కాంగ్రెస్ చేయకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
సీఎం రేవంత్ ఢిల్లీ బీజేపీ పెద్దలతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. చీకట్లో చేతులు కలపకుంటే ఢిల్లీలో ఎంపీ దూబే గృహ ప్రవేశానికి రేవంత్ ఎందుకు వెళ్లారో బీజేపీ స్టేట్ చీఫ్ చెప్పాలి. తుగ్లక్ రోడ్‌లోని రేవంత్ ఇంటిని రీ మోడలింగ్ చేయించింది ఓ బీజేపీ ఎంపీయే. సీఎం రమేశ్‌కు రేవంత్ కాంట్రాక్టులు ఇస్తున్నందుకే బీజేపీ పెద్దలు మద్దతిస్తున్నారు. మంత్రి పొంగులేటి ఇంటిపై ఈడీ రైడ్స్ జరిగినా కేసు వేయకుండా ఎందుకు
వదిలాశారు.
– కేటీఆర్
వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రేవంత్‌రెడ్డి ఫెయిల్
వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలపై రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలకు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక స్థానిక ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించాను. 90శాతం మున్సిపాల్టీలపై గులాబీ జెండాను ఎగురేశాం. జీహెచ్ఎంసీని రెండోసారి కైవసం చేసుకున్నాం. రాష్ట్రంలోని అన్ని జడ్పీలను గెలుచుకున్నాం..’అని గుర్తుచేశారు. కానీ రేవంత్‌రెడ్డి తన సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేకపోయారు..
పీసీసీ అధ్యక్షుడిగా ఉండి దాదాపు అన్ని ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దారుణ ఓటమిని మూటగట్టుకున్నది.. ఏకంగా డిపాజిట్లు కోల్పోయింది’ అని ఎద్దేవా చేశారు. ఇక ఓటముల విషయానికి వస్తే రాహుల్ ఎన్నిచోట్ల విజయాలు సాధించారో రేవంత్‌రెడ్డి చెబితే బాగుంటుందని చురకలంటించారు. రాహుల్, రేవంత్ ముమ్మాటికీ ఐరన్లెగ్లేనని దెప్పిపొడిచారు. తాను వ్యక్తిగతంగా విజయం సాధించానని గొప్పలు చెప్పుకోవడం లేదని, పార్టీ సమిష్టి కృషితోనే అప్రతిహతంగా దూసుకెళ్లామని ఉద్ఘాటించారు.
అభివృద్ధి కోసం పార్టీ మారామని బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలు మాట్లాడడం హాస్యాస్పదం. అభివృద్ధి కోసం పార్టీ మారామని మైకుల్లో చెబుతున్న ఎమ్మెల్యేలు.. కాంగ్రెస్ ఆఫీసులో కూర్చొని బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పడం పెద్ద కామెడీ. కడియం, పోచారం పదవుల కోసం దిగజారడం దుర్మార్గం. రేవంత్‌రెడ్డికి దమ్ముంటే పార్టీ మారిన 10మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి.
– కేటీఆర్
మళ్లీ అధికారంలోకి వస్తాం
బీఆర్ఎస్ 2028లో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, పంచాయతీ ఎన్నికలే ఇందుకు స్పష్టమైన సూచిక అని కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు సమయం కోసం ఎదురుచూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే పరిషత్ ఎన్నికల్లో గులాబీ పార్టీ హవా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలను చూసి ప్రభుత్వం ప్రాదేశిక ఎన్నికలు నిర్వహించడం అనుమానేనని, ఇటీవల మీడియా సమావేశంలో రేవంత్‌రెడ్డి పరోక్షంగా చెప్పారని గుర్తుచేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుచుకున్న స్థానాలను పెంచుకొనేందుకు రెబల్స్‌ను కాంగ్రెస్ ఖాతాలో కలుపుకోవడం విడ్డూరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్వతంత్రులను సైతం కలుపుకొని జాబితా విడుదల చేశారని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసిన ప్రజలు మాత్రం బీఆర్ఎస్ను ఆదరించారని స్పష్టంచేశారు.