ఒక పార్టీగా బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రయాణంలో దాటిన మైలురాళ్లు ప్రతి కార్యకర్తకూ తెలుసు. తెలుగు రాష్ర్టాల్లో పాతికేండ్ల ప్రస్థానం దాటిన ప్రాంతీయ పార్టీలు రెండే. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఒకటైతే, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లి, రాష్ర్టాన్ని సాధించి, అందరి కలను నెరవేర్చిన కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ రెండోది.
-కేటీఆర్
KTR | మేడ్చల్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : రేవంత్‌రెడ్డిలాంటి మోసపూరిత వ్యక్తిని నమ్మి తెలంగాణ రాష్ట్రం ఆగమైందని, రేవంత్‌లాంటి వారిని నమ్మితే ప్రజలకు గోల్డ్ కాదు కదా.. రోల్డ్ గోల్డ్ కూడా రాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ ఇచ్చిన అసంబద్ధ హామీలతో ప్రజల జీవితాలు సంక్షోభంలో పడ్డాయని వాపోయారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభలో కేటీఆర్ మాట్లాడారు. రెండు ఢిల్లీ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వైఖరి ఒక్కటేనని, ఆ పార్టీలకు కావాల్సింది ఢిల్లీకి మూటలు పంపేవాళ్లే తప్ప తెలంగాణ ప్రజలు కాదని విమర్శించారు.
‘మన ప్రజలకు నష్టం కలిగినా సరే.. ఢిల్లీకి మూటలు పంపి సీట్లు కాపాడుకునేటోళ్లే ఆ రెండు పార్టీలకు కావాలె’ అని ఎద్దేవాచేశారు. ‘ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ నాయకులు ఆశ చూపిండ్రు. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ రూ.లక్ష ఇస్తే దానికి తులం బంగారం కలిపి ఇస్తామని చెప్పిండ్రు. మేం రూ.10 వేల రైతుబంధు ఇస్తే వారు 15 వేలు ఇస్తమన్నరు. రెండు వేల పింఛన్‌ను నాలుగు వేలు చేస్తమన్నరు. ఇట్ల వాళ్లు చెప్పిన మయామాటలు నమ్మి ఇవాళ రాష్ట్రం మొత్తం బాధ పడుతున్న పరిస్థితి ఉన్నది’ అంటూ దుయ్యబట్టారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి తప్ప ఎవరూ సంతోషంగా లేరని, చివరికి ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్నారని చెప్పారు.
‘ఒక్కసారి మోసపోతే ఆది మోసగాడి తప్పు.. కానీ పదేపదే మోసపోతే అది ప్రజల తప్పు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలవుతున్నా హైదరాబాద్‌లో ఒక్క అభివృద్ధి పనిని కూడా మొదలు పెట్టలేదు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్న ప్రేమ ఢిల్లీ పార్టీలకు ఉంటదా? ఎట్లుండె తెలంగాణ ఎట్లయిందో ఒక్కసారి ఆలోచించాలె. జీహెచ్ఎంసీ ఎన్నికలే కాదు.. ఎమ్మెల్యే, ఎంపీ.. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా తెలంగాణకు శ్రీరామ రక్షలాంటి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచేందుకు ఏకోన్ముకంగా కదలాలె’ అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్, బీజేపీలకు కర్రుకాల్చి వాత పెట్టాలని సూచించారు.
ఒక పార్టీగా బీఆర్ఎస్ 25 ఏండ్ల ప్రయాణంలో దాటిన మైలురాళ్లు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు తెలుసునని, తెలుగు రాష్ర్టాల్లో విజయవంతంగా నిలదొక్కుకున్న రెండో పార్టీగా బీఆర్ఎస్ ఘనత సాధించిందని కేటీఆర్ వివరించారు. నాడు దివంగత నేత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం ఒకటైతే , తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయాల ఎత్తుకు తీసుకెళ్లి, రాష్ర్టాన్ని సాధించి, అందరి కలను నెరవేర్చిన కేసీఆర్ నాయకత్వంలోని ఏర్పడిన బీఆర్ఎస్ రెండో పార్టీ అని చెప్పారు. తెలంగాణ ఆత్మను, తెలంగాణ స్వాభిమానాన్ని కాపాడే, నలుగురికి భరోసా కలిగించే పార్టీ బీఆర్ఎస్ ఒక్కటేనని స్పష్టంచేశారు. ఎండను సైతం లెక్కచేయకుండా సభకు వచ్చిన ఆడబిడ్డలకు, పార్టీ శ్రేణులకు, ప్రజలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభ సందర్భంగా మల్కాజిగిరి మొత్తం గులాబీమయమైంది. కేటీఆర్‌కు మల్కాజిగిరి బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎర్రటి ఎండను లెక్క చేయకుండా భారీ సంఖ్యలో తరలివచ్చి అపూర్వ స్వాగతం పలికారు. ఆనంద్‌బాగ్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు కేటీఆర్‌ను భారీ ర్యాలీతో తోడ్కొని వచ్చారు. కేటీఆర్‌తో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు, ఎంబీసీ మాజీ చైర్మన్ నందికంటి శ్రీధర్ ఉన్నారు.
కేటీఆర్ సమక్షంలో మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వందలాది మంది బీఆర్ఎస్లో చేరారు. వీరిలో వివిధ పార్టీల నుంచి హేమంత్ పటేల్, అర్వింద్, బంటి వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకుంటే ప్రజలకు మంచి జరుగుతుందనేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డే నిదర్శమని, నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజశేఖర్‌రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు.