నల్లగొండ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపట్ల చిత్తశుద్ధితో ఉంటే వెంటనే సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డ్ మెంబర్ల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ ప్రజాప్రతినిధులను అభినందించి సన్మానించారు.
సీఎం రేవంత్ కేవలం కాలక్షేప రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముఖ్యమంత్రికి దమ్ముంటే, కేసుల గురించి వెనుక నుండి లీకులు ఇవ్వడం మానేసి, నేరుగా కెమెరా ముందుకు రావాలని, ఏ కేసు పెడుతున్నారో చెప్పాలని సవాల్ విసిరారు. హోంమంత్రి కూడా ఆయనే కాబట్టి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాలని, శిఖండి రాజకీయాలు చేయడం తగదని విమర్శించారు. ప్రజా ప్రయోజనాలకంటే కేవలం కేసుల చుట్టూనే ప్రభుత్వాన్ని తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి నోటీసుల డ్రామాలు ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, రైతు బంధు వంటి హామీల అమలుపై ప్రజలు నిలదీస్తారనే భయంతోనే ముఖ్యమంత్రి ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.