KTR | హైదరాబాద్ : పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ. 4 లక్షల 17 వేల కోట్లు మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అప్పులపై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు.
ఇవాళ తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. అందాల పోటీలకు 250 కోట్లు ఉన్నాయి కానీ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లకు బెనిఫిట్స్‌కు పైసల్లేవా..? ఇదేనా నీ ప్రాధాన్యత. నన్ను కోసుకొని వండుకుని తింటారా.. ఇది ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి సీఎం మాట్లాడిన మాట. నిన్ను కోసుకుతినేంత పిచ్చోడు ఎవడూ లేరు. నీ తలమాసిన విధానాలతోని నీవే ఈ రాష్ట్రాన్ని కాల్చుకు తింటున్నవ్. రాచిరంపాన పెడుతున్నావ్. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ మంచిగా ఉండే ఇప్పుడు ఎందుకు లేదు అని ప్రజలు ప్రశ్నించుకుంటున్నారు. రైతుబంధు సమయానికి పడుతుండే అని అనుకుంటున్నారు. ఆసరా పెన్షన్లు ఎందుకు ఎగ్గొడుతుండు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు రాష్ట్రం పురోగమనంలో ఉంటే ఇప్పుడు ఎందుకు తిరోగమనంలో ఉంది అని ప్రశ్నించుకుంటున్నారు. ఇది నాయకత్వం లోపం కాదా..? ఇది మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పెట్టిన శాపం. మార్పు పేరుతో చేసిన దుర్మార్గం ఇది. పరిపాలిస్తున్న రాష్ట్రానికి శాపనార్థాలు పెట్టిన సీఎం ఈ దేశంలో ఎవరూ లేరు. ఎయిడ్స్ పెషేంట్ అంటవి. క్యాన్సర్ పెషెంట్ అంటివి.. ఆఖరికి నిన్న దివాళా తీసింది అని అంటివి. రాష్ట్రం పాలిట నీ మాటలు శాపంగా మారాయని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఏ రాష్ట్రానికైనా ప్రభుత్వానికైనా అప్పులు, ఆస్తులు వారసత్వంగా వస్తాయి. కాంగ్రెసోళ్లు మాకు అప్పజెప్పినప్పుడు అప్పులు, ఆస్తులు ఇచ్చారు. 2014 లెక్కలు తీసుకుంటే.. రాష్ట్ర ఆదాయం 51 వేల కోట్లు. మేం దిగిపోయిన నాడు ఆదాయం 2 లక్షల 16 వేల 567 కోట్లు. మరి రాష్ట్ర ఆదాయం పెరగలేదా..? 2014-15లో రెవెన్యూ మిగులు 369 కోట్లు.. మేం దిగిపోయిన నాడు 4882 కోట్లు. ఇది కాగ్ లెక్క. కానీ ఇష్టమొచ్చిన లెక్కలు చెబుతున్నడు రేవంత్ రెడ్డి. శ్వేతపత్రం అనే అబద్దాల జాతర మొదలు పెట్టారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాలకే 6 లక్షల కోట్ల అప్పు అని చెప్పారు. నిన్న చెబుతున్నాడు.. 8 లక్షల 29 వేల కోట్లు అని. ఈ సంఖ్య రోజురోజుకు మారుతుంది. సర్కార్ నడుపుతున్నారా.. సర్కస్ నడుపుతున్నారా..? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పదేండ్ల కాలంలో 4 లక్షల 17 వేల కోట్ల మాత్రమే చేశాం. ఏడాదికి 40 వేల కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించె అప్పు లక్షా 15 వేల 599 కోట్లు. 4 వేల కోట్ల నెలసరి ఆదాయంతో మాకు అప్పజెపితే.. తిరిగి మేం 2023 డిసెంబర్లో 18 వేల కోట్లతో అప్పజెప్పాం.. నిన్న 2025 మే నెలలో ఏం మాట్లాడుతున్నారు. 18 వేల కోట్లే వస్తుందని అంటున్నరు. మరి ఈ 17 నెలల కాలంలో నువ్వు ఏం చేస్తున్నవ్.. నీ ప్రభుత్వం ఏం జేస్తుంది. ఎందుకు ఆదాయం పెంచలేకపోయారు. కేసీఆర్ అప్పజెప్పిన 18 వేల కోట్లు తప్ప నీ ప్రభుత్వం రూపాయి అయినా ఆదాయం పెంచగలిగిందా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
7 వేల కోట్ల అప్పు మిత్తి కడుతున్నా అంటుండు రేవంత్ రెడ్డి. ఇంకో రోజు ఆరున్నర వేల కోట్లు కడుతున్న అంటున్నడు.. బడ్జెట్లో గత 14 నెలలో 64 వేల 768 కోట్లు కట్టిన అని చెప్పిండు. నిన్న 10 వేల కోట్ల నెలకు అని చెబుతుండు. ఆయన చెప్పిన లెక్క ప్రకారం.. నెలకు 4 వేల 600 కోట్లు. ఇది కూడా తప్పే. ఆర్బీఐ రిపోర్టు ప్రకారం తెలంగాణ నెలకు కడుతున్నది అప్పు మిత్తి కలిపి నెలకు 2 వేల కోట్లు మాత్రమే. వచ్చే పదేండ్లలో ఎంత కట్టాలో కూడా లెక్క ఉంది.. ఆర్బీఐ లెక్క ప్రకారం.. అసలు లక్షా 2 వేల కోట్లు, మిత్తి లక్షా 64 వేల కోట్లు 2032-33 వరకు. ఏడాదికి 27 వేల కోట్లు అవుతుంది. ఇంతే తప్ప ఏం లేదు. తెలంగాణ అప్పులు, జీఎస్డీపీ నిష్పత్తిలో 24వ ర్యాంకులో ఉంది. మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంది అని కేంద్రమే చెబుతుంది. తలసారి ఆదాయంలో నంబర్ వన్ చేశారు కేసీఆర్. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో 12వ స్థానంలో ఉండే. మేం దిగిపోయేనాటికి నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లాం అని కేటీఆర్ గుర్తు చేశారు.