హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ)/ జడ్చర్ల టౌన్/వనపర్తి టౌన్ : మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ (94) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు లక్ష్మారెడ్డి నివాసానికి చేరుకొని లక్ష్మమ్మ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
లక్ష్మారెడ్డిని కేటీఆర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. లక్ష్మమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు వారి కుటుంబానికి మ నోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నట్టు తెలిపారు.