హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : గులాబీ పార్టీకి కంచుకోట జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయదుందుభి మోగించనున్నదా? పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలోని అభివృద్ధితోపాటు రెండేండ్ల కాంగ్రెస్ పాలనా వైఫల్యాలకు అద్దం పట్టే రీతిలో జూబ్లీహిల్స్ ఓటరు తీర్పు ఇవ్వనున్నారా? అవును.. అక్షరాల నిజం అంటున్నది ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ అనే సంస్థ నిర్వహించిన సర్వే. అధికార కాంగ్రెస్ కంటే ఏకంగా 10.1 శాతం ఎక్కువ ఓట్లతో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేయనుందని ఆ సర్వే వెల్లడించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రాజకీయం ఆసక్తి రేపుతున్న దరిమిలా కోడ్మో సంస్థ ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో శాస్త్రీయంగా సర్వేను చేపట్టింది. ఇందులో బీఆర్ఎస్ 42.8 శాతం ఓట్లతో ముందంజలో నిలువగా.. హస్తం, కమలం పార్టీలు రెండు, మూడుస్థానాలకు పరిమితమయ్యాయి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరు నాడి ఎలా ఉన్నదో తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వేలో భాగంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరు కావాలనుకుంటున్నారనే అంశాన్ని కూడా పొందుపరిచారు.
ఈ క్రమంలో ఏకంగా 46.5 శాతం మంది ఓటర్లు మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని తమ అభీష్టాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదలు గులాబీ పార్టీకి కంచుకోటలా నిలుస్తున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో కోడ్మో సంస్థ ఇటీవల నియోజకవర్గంలో సర్వే నిర్వహించింది. గతంలో కాంగ్రెస్ రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో సర్వే చేసిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తరఫున కూడా సర్వే నిర్వహించింది. తాజాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై ఇటీవల కోడ్మో స్వతంత్రంగా టెలిఫోన్ ద్వారా సర్వే చేపట్టింది. దాదాపు రెండు వేలమంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. వీరిలో 22.9 శాతం మంది మహిళలు ఉన్నారు. నియోజకవర్గంలోని 19 ప్రాంతాల్లో అన్ని వర్గాల ప్రజల్లో కొత్త ఓటరు మొదలు 50ఏండ్లుపైబడిన వారు ఇందులో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. నిరక్షరాస్యుల నుంచి వివిధ రకాల వృత్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నవారు, విద్యావంతులు సర్వేలో పాల్గొన్నారు.
నియోజకవర్గంలో 42.8 శాతం మంది ఓటర్లు రానున్న ఉపఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయనున్నట్టు ఈ సర్వేలో స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి 32.7 శాతం మంది జైకొట్టగా.. మరో 19.5 శాతం మంది బీజేపీ వైపు మొగ్గుచూపారు. ఇతరులు మరో ఐదు శాతం ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ఏకంగా 10.1 శాతం ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది. సర్వేలో వెల్లడైన ప్రధాన ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి…
కోడ్మో సంస్థ ఈ సర్వేలో వచ్చేసారి ముఖ్యమంత్రి ఎవరు కావాలని కోరుకుంటున్నారనే ప్రశ్నను కూడా ఓటర్ల ముందుఉంచింది. ఈ క్రమంలో ఏకంగా 46 శాతం మంది మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కుండబద్ధలు కొట్టారు. 28.4 శాతం మంది రేవంత్రెడ్డి తిరిగి సీఎం కావాలని కోరుకుంటుండగా… కేంద్ర మంత్రి, బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సీఎం కావాలని 1.1 శాతం మంది కోరుకున్నారు. కాంగ్రెస్ సర్కారు పనితీరు ఎలా ఉందనే కీలక అంశాన్ని కూడా ప్రస్తావించగా.. 41.5 శాతం జూబ్లీహిల్స్ ఓటర్లు రేవంత్ సర్కారు పనితీరు ఏమీ బాగాలేదని పెదవి విరిచారు. 35.4 శాతం మంది బాగానే ఉందని చెప్పగా.. 23.1 శాతం మంది పరవాలేదు అని వెల్లడించారు. మరోవైపు ప్రజా సమస్యలను కూడా ఓటర్ల ముందు ఉంచగా.. 38.4 శాతం ఓటర్లు ఎలాంటి సమస్యను ఏకరువు పెట్టలేదు. కానీ 61.6 శాతం మంది మాత్రం డ్రైనేజీ, అధ్వాన రహదారులు, మంచినీటి సమస్య, ట్రాఫిక్, కరెంటు కోతలు తదితర సమస్యల్ని ఎదుర్కొంటున్నామని వెల్లడించారు.