హయత్‌నగర్, సెప్టెంబర్ 27: మదర్ డెయిరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థులైన రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి, సందిల భాస్కర్‌గౌడ్ జయభేరి మోగించగా, మరో స్థానంలో కర్నాటి జయశ్రీ గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ఏ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ హాలులో శనివారం నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ లిమిటెడ్ (నార్ముల్ మదర్ డెయిరీ)కి చెందిన మూడు డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు జనరల్ పాలకవర్గ స్థానాలకు ఐదుగురు పోటీపడగా, వారిలో బీఆర్ఎస్ అభ్యర్థులైన సందిల భాస్కర్ గౌడ్ 240 ఓట్లు, రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి 154 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నిలబెట్టిన అభ్యర్థి కుంచాల ప్రవీణ్‌రెడ్డికి 09 ఓట్లే రావడంతో చతికిలపడ్డారు. పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డికి 16 ఓట్లు, శీలం వెంకటనర్సింహారెడ్డికి 152 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 311 ఓట్లకు గాను 308 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 307 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఒక ఓటు తిరస్కరణకు గురైంది. జనరల్ మహిళా రిజర్వు పాలకవర్గ స్థానానికి నలుగురు పోటీపడగా వారిలో కర్నాటి జయశ్రీ 176 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గంట్ల రాధికకు 55 ఓట్లు, మోతె పూలమ్మకు 03 ఓట్లు, సూదగాని విజయకు 63 ఓట్ల చొప్పున పోలయ్యాయి. మొత్తం 311 ఓట్లకు గాను 308 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 297 ఓట్లు చెల్లుబాటయ్యాయి. 11 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి.
కంగుతిన్న కాంగ్రెస్
మూడింటికి రెండు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులైన రచ్చ లక్ష్మీ నర్సింహారెడ్డి, సందిల భాస్కర్‌గౌడ్ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ కంగుతిన్నది. కర్నాటి జయశ్రీ ఒకేస్థానం కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన చైర్మన్లు ఆందోళనలో పడ్డారు. ఆలేరు, తుంగతుర్తి ఎమ్మెల్యేలు బీర్ల అయిలయ్య, మందుల సామేలు, డీసీసీ అధ్యక్షుడు సంజీవరెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి తీరుపై పాడిరైతుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం ప్రతిఫలించింది.
చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని ఆందోళన
బీఆర్ఎస్ అభ్యర్థుల విజయంతో మదర్ డెయిరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి పదవి నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తూ పాడి రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మదర్ డెయిరీ సంస్థ గత 3 నెలల పాల బిల్లుల బకాయిలను వెంటనే చెల్లించాలని ఆందోళనకు చేపట్టారు.
కేటీఆర్ అభినందనలు
మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవన్లో తనను కలిసిన డైరెక్టర్‌గా విజయం సాధించిన రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఆయనతోపాటు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్, నాయకులు నేవూరి ధర్మేందర్‌రెడ్డి, వల్లమల్ల కృష్ణ, పడాల సతీశ్‌రెడ్డి, అవినాశ్ తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనర్సింహారెడ్డికి కేసీఆర్ అభినందనలు
మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా జయకేతనం ఎగురవేసిన రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డిని పార్టీ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. డైరెక్టర్‌గా గెలిచిన అనంతరం లక్ష్మీనర్సింహారెడ్డి.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌తోపాటు శనివారం కేసీఆర్‌ను కలిశారు. జరిగిన ఎన్నకల గురించి లక్ష్మీనర్సింహారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ దీవెనలు పొందారు.