హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ‘చైర్మన్ సార్.. మైక్ ఇవ్వండి సార్..’ ‘22ఏ భూములపై ఎందుకు చర్చించరు సార్’ ‘అధ్యక్షా.. అధ్యక్షా.. మైక్ ఇవ్వండి’ అంటూ పదే పదే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రాధేయపడినా.. శాసనమండలి చైర్మన్ అవకాశం ఇవ్వలేదు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది ప్రజలు ఎదురుచూస్తున్న 22ఏ నిషేధిత జాబితాల్లోని భూముల గురించి, దాని వెనుక ఉన్న భూ కుంభకోణాల గురించి బీఆర్ఎస్ సభ్యులు చర్చకు పట్టుబట్టినా మండలి చైర్మన్ నిరాకరించారు. మైక్ ఇస్తామంటూనే, ఒకటికి రెండుసార్లు మైక్ కట్ చేయడంతో కొన్ని గంటలపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎదురుచూశారు. గురువారం 22-ఏ భూములపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించడంతో.. పెద్దపెట్టున నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ ప్రకటించారు. గురువారం శాసనమండలి ప్రారంభమైన వెంటనే చైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. కాగా, రాష్ర్టాన్ని కుదిపేస్తున్న భూ కుంభకోణాలు, సీఎం సోదరుల భూ దందాలు, నిషేధిత భూముల జాబితా 22ఏపై సభలో చర్చ జరుగాలని కోరుతూ సభ ప్రారంభమైన దగ్గర నుంచి మండలిలో బీఆర్ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి నేతృత్వంలో ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం వద్ద నిరసనకు దిగారు. ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎంసీ కోటిరెడ్డి, సురభి వాణీదేవి, నవీన్‌రావు తదితరులు వెల్‌వైపు దూసుకొచ్చారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చర్చకు పట్టుబట్టారు. ప్లకార్డులు తీసేయాలని చైర్మన్ గుత్తాసుఖేందర్‌రెడ్డి పలుమార్లు విజ్ఞప్తి చేసినా బీఆర్ఎస్ సభ్యులు వెనకి తగ్గలేదు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీల వైపు కెమెరా చూపకుండా ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఒకానొక దశలో పోడియం వద్దకు చేరుకోవడంతో ఒక్కసారిగా సుమారు 35 మందికిపైగా మార్షల్స్ మోహరించారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు తీన్మార్ మల్లన్న పక సీటులో కూర్చుని, ఒకసారిగా తన జేబులోంచి ‘సీఎం బామ్మర్దికి అమృత్ టెండర్లు, తమ్ముడికి రావిరాల భూములు.. రైజింగ్ అనుముల ఫ్యామిలీ’అని నినాదాలు రాసి ఉన్న కాగితాన్ని ప్రదర్శించారు. దీనిపై చైర్మన్ గుత్తా తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. సీట్లలో కూర్చుంటేనే మైక్ ఇస్తామని చైర్మన్ చెప్పడంతో.. వెళ్లి తమ స్థానాల్లో కూర్చున్నారు. అనంతరం స్పీకర్ మైక్ ఇవ్వడంతో సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. మండలిలో మార్షల్స్ ప్రవర్తను తీవ్రంగా తప్పుబట్టారు. మార్షల్స్ ద్వారా సభ్యుల గౌరవానికి భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చ చేపడుతామని చెబుతూనే.. 22ఏ భూములపై తమ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన ప్రభుత్వ తీరుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.