హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ‘రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయినట్టు ఎలా అవుతుంది? ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.94,000 కోట్లు ఖర్చు చేస్తే రూ. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది?’ అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక బయటకు రాకుండానే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కొన్ని పత్రికల్లో వార్తలు ఎలా వచ్చాయని నిలదీశారు.
ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నివేదికను లీక్ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. త్వరలో జరగనున్న శాసనసభ సమావేశంలో కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ (పీపీటీ) ఇచ్చేందుకు అనుమతి కోరుతూ గురువారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహాచార్యులను కలిసి ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన స్వీకరించలేదు.
అనంతరం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కుత్బుల్లాపూర్ ఎమ్యెల్యే వివేకానందగౌడ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో కలిసి బనకచర్ల, గోదావరి-కావేరి లింక్ పేరుతో గోదావరి జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు రేవంత్ జీ హుజూర్ అంటున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ నేల నుంచి కరువును పారదోలిన ప్రపంచలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కాళేశ్వరం ప్రాజెక్టు అని కొనియాడారు. తెలంగాణపై వ్యతిరేకతతో కాంగ్రెస్, బీజేపీ కూడబలుక్కొని కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి వాస్తవాలు, దానివల్ల రాష్ర్టానికి కలిగిన ప్రయోజనాలను ప్రజల ముందు ఉంచడం అవసరమని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ప్రజలతోపాటు శాసనసభలోని సభ్యులందరికీ ఈ ప్రాజెక్టు గొప్పతనం, ప్రాధాన్యం గురించి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాబట్టి అసెంబ్లీలో దీనిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని స్పీకర్‌ను కోరుతున్నట్టు చెప్పారు.
అపాయింట్మెంట్ తీసుకున్నా స్పందన లేదు వినతిపత్రం ఇచ్చేందుకు వస్తున్నామని ఫోన్ ద్వారా స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అపాయింట్మెంట్ తీసుకున్నామని, అయినా ఆయన స్పందించకపోవడం బాధాకరమని ప్రశాంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రోజంతా చూసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. శుక్రవారం మరోమారు ఆయనను కలిసి వినతిపత్రం ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు.