హైదరాబాద్, అక్టోబరు 9 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో దివ్యాంగుల కార్పొరేషన్‌కు కేటాయించింది రూ.63 కోట్లయితే రూ.వంద కోట్ల అవినీతి జరిగిందంటూ దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య అవివేకంగా మాట్లాడుతున్నారని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డి ఎద్దేవాచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్యారెంటీలు అమలు చేసే శక్తి లేక కాంగ్రెస్ నాయకులు తనపై, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్‌పై నిరాధార ఆరోపణలు చేశారని మండిపడ్డారు. దివ్యాంగుల సీములకు సంబంధించి కేసీఆర్ హయాంలో ఆన్లైన్లో పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరిగిందని స్పష్టం చేశారు. అవినీతి జరిగితే విచారణకు ఆదేశించాలి సూచించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిటర్మ్‌లో దివ్యాంగుల శాఖ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వర్రావు ఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. దివ్యాంగులకు రూ. ఆరు వేల పెన్షన్, ఉచిత బస్సు ప్రయాణం ఎందుకు అమలుకు నోచుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ తరహాలో మోసపోవద్దని హర్యాణా ఓటర్లు కాంగ్రెస్‌ను తిరసరించారని తెలిపారు. వైఎస్ హయాంలోనే దివ్యాంగుల సంక్షేమానికి కేంద్ర నిధులు ఆగిపోయాయని, రాష్ట్రం ద్వారానే తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం 492 జీవో జారీ చేసిందని గుర్తు చేశారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీల అమలు కోసం త్వరలోనే సచివాలయాన్ని ముట్టడిస్తామని ప్రకటించారు.